ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో ఉప్పు నిప్పూగా ఉండే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. వైఎస్ జగన్‌కు.. నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. బుధవారం జరగబోయే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించేందుకు వైఎస్ జగన్‌కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినట్లు తెలిసింది. నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. మాజీ సీఎం వైఎస్ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఫోన్ కాల్‌కు వైఎస్ జగన్ అందుబాటులో లేనట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీ నుంచి కూడా ఎవరూ హాజరుకాకపోవచ్చని సమాచారం.
మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ.. టీడీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోగా.. టీడీపీ కూటమి ఏకంగా 164 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. టీడీపీ సొంతంగా 144 చోట్ల పోటీ చేసి.. 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద రేపు ప్రమాణ స్వీకారం జరగనుంది .ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరుకానున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, రజినీకాంత్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లకు సైతం ఆహ్వానం అందినట్లు తెలిసింది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, రజినీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2019 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వైఎస్ జగన్.. అప్పట్లో తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. అయితే చంద్రబాబు ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.