అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు చెందిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకుళ్తోంది. ఇప్పుడు అందరి చూపు ఈ కంపెనీ స్టాక్‌పైనే పడింది. వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్ కొడుతోంది. గత వారం రోజుల్లో ఈ స్టాక్ 29 శాతం మేర పెరిగింది. ఈరోజు ఎన్ఎస్ఈలో 10 శాతం పెరిగి అప్పర్ సర్క్కూట్ తాకింది. చివరకు రూ. 31.54 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ దూసుకెళ్లేందుకు ప్రధాన కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.
మార్కెట్ నిపుణుల ప్రకారం.. రిలయన్స్ పవర్ కంపెనీ ఇప్పుడు రుణ రహిత సంస్థగా అవతరించింది. రుణాలు మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. స్టాండలోన్ ప్రాతిపదికన కంపెనీ డెబ్డ్ ఫ్రీగా ప్రకటించారు. దీంతో రూ. 28 వద్ద రిలయన్స్ పవర్ షేర్లు బ్రేకవుట్ అయ్యాయి. దీంతో ఈ షేరు పైపైకి దూసుకుపోతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రూ. 36 స్థాయిని చేరుకునే అవకాశం ఉందని కొత్త టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. కంపెనీ రూ. 800 కోట్లను బ్యాంకులకు తిరిగి చెల్లించినట్లు స్టాక్స్ బాక్స్ రీసెర్చ్ అనలిస్ట్ పార్థ్ షా వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి అప్పులు లేకపోవడంతో ఈ స్టాక్ ను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. మోదీ 3.O ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చే ఎనర్జీ పాలసీల ద్వారా రిలయన్స్ పవర్ లబ్ధి పొందుతుందని అంతా భావిస్తున్నారు. ఈ కారణంగానే షేరు ధర దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
రిలయన్స్ పవర్ షేరు రూ. 28 వద్ద బ్రేకవుట్ దాటిందని ఛాయిస్ బ్రోకింగ్ సంస్థ తెలిపింది. ఇది పాజిటివ్ చార్ట్ ప్యాటర్న్ ను సూచిస్తోందని, రూ. 32 స్థాయిని అధిగమిస్తే రూ. 36 మార్క్ దాటే అవకాశం ఉందని పేర్కొంది. కొత్త ఇన్వెస్టర్లు ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చని సూచించింది. అయితే స్టాప్ లాస్ రూ. 28 గా సెట్ చేసుకోవాలని పేర్కొంది. రిలయన్స్ పవర్ షేరు ధర ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో చూసుకుంటే రూ. 31.54 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 34.45 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 13.80 వద్ద ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 12,670 కోట్లుగా ఉంది. రిలయన్స్ పవర్ అనిల్ ధీరూబాయ్ గ్రూప్ కంపెనీల్లో ఒకటి. ఇంతకుముందు రిలయన్స్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్ పేరుతో ఉండేది. భారత్ తో పాటు అంతర్జాతీయంగా పవర్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. 1995 జనవరి 17న ఈ కంపెనీని ఏర్పాటు చేశారు.