నాలుగేళ్లుగా కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. కరోనాతో ఏర్పడిన ఆర్దిక మాంద్యం దెబ్బకు ఐటీ సంస్థలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలు తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, లేఆఫ్ బాధితుడు భారత సంతతికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి సంస్థ చెప్పిన కారణాన్ని పంచుకున్న అతడు... తనతో పాటు తన టీమ్ మొత్తాన్ని సాగనంపారని అతడు పేర్కొన్నాడు.
‘తొలగించడానికి ముందు నన్ను ఇంటర్వ్యూ చేశారు.. నా టీమ్ సభ్యుల స్థానంంలో భారతీయులను నియమిస్తామని చెప్పడంతో షాకయ్యాను... ‘నేనూ భారతీయుడినే’ అని చెప్పా.. కానీ వాళ్లకు భారత్ నుంచి వచ్చినవాళ్లే కావాలంట.. వారు తక్కువ వేతనానికే పని చేస్తారని కంపెనీ చెప్పింది.. నేనెంత చెప్పినా నా మాటలను వినిపించుకోలేదు’ అంటూ వాపోయాడు. తాను ఇండియాలోనే పుట్టానని, రెండేళ్లున్నప్పుడు కుటుంబంతో పాటు అమెరికా వచ్చినట్లు వెల్లడించాడు.
‘‘నేను భారతీయుడ్ని అని చెబితే.. వారు (కంపెనీ) 'లేదు, లేదు, లేదు, మీకు అర్థం కాదు. మేము మిమ్మల్ని వదిలించుకుంటున్నాం... భారత్ నుంచి వచ్చిన భారతీయులు చేయవలసిన పనిని మేము భారతదేశానికి తరలిస్తున్నాం.. వారు అక్కడ చౌకగా చేస్తారు... ’’ అని పేర్కొన్నాడు. తమను ఉద్యోగం నుంచి తొలగించి, ఆ స్థానంలో భారతీయులను చేర్చుకోవడం గురించి అతడు చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 3.5 మిలియన్ల మంది వీక్షించగా.. 40 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.. ‘బహుశా నువ్వు ఖరీదైపోయి ఉంటావ్ బ్రో’ అంటూ ఓ నెటిజన్.. ‘భారతీయుడి తరహాలో ఇంగ్లిష్ మాట్లాడి మళ్లీ ఉద్యోగంలో చేరిపో’ అంటూ మరొకరు..
‘‘ఇదంతా డబ్బు గురించే. భారతీయులు చాలా తక్కువకే వస్తారని భావన.. భారత్‌తో కానీ, చైనాతో కానీ మనం పోటీ పడలేం’’ అని ఇంకో వ్యక్తి .. ‘స్టాండప్ కమెడియన్‌గా మంచి భవిష్యత్ ఉంది ట్రై చేయొచ్చు కదా!’ ఇంకొకరు కామెంట్లు పెట్టారు. ‘భారత్ ఎందుకు గొప్ప దేశం కాదు? ఎంతో ప్రతిభావంతులకు కొదువలేని ఈ దేశం సూపర్ పవర్ కాకపోవడం కలవరపెడుతోంది.. నోబెల్ గ్రహీతలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న పారిశ్రామికవేత్తలున్న భారతదేశం ప్రపంచ వేదికపై ఆధిపత్యం చెలాయించకపోవడమే ఆశ్చర్యం’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.