కువైట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో మంటలు చెలరేగి 43 మంది భారతీయులు సహా 45 మంది సజీవదహనమయ్యారు. అగ్ని ప్రమాదానికి గురైన భవనంలో పెద్ద సంఖ్యలో కేరళకు చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ భవనం యజమాని కూడా కేరళకు చెందిన ఎన్బీటీసీ సంస్థల అధినేత కేజీ అబ్రహామ్ అని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో భవనంలో ఉన్న లేబర్ క్యాంప్ కిచెన్‌లో మంటలు చెలరేగినట్టు వెల్లడించాయి. మంటలు చెలరేగిన తర్వాత కొంత మంది భవనం పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. శరవేగంగా మంటలు వ్యాపించడంతో పదుల సంఖ్యలో లోపలి చిక్కుకుని, ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక, అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపల చాలా మంది ఇంకా చిక్కుకున్నారని, ఈ ఘటనలో కనీసం 40 మంది గాయపడ్డారని వెల్లడించారు. వీరిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో 30 మందికిపైగా భారతీయులేనని సమాచారం. అలాగే, చనిపోయినవారిలో 40 మందికిపైగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, మలయాళీ వ్యాపారవేత్త ఎన్బీటీసీ సంస్థ అధినేత కేజీ అబ్రహామ్‌కు చెందిన ఆ అపార్ట్‌మెంట్ భవనంలో భారత్ నుచి వెళ్లిన 195 మంది కార్మిక కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. వీరిలో చాలా మంది కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు. కాగా, కింద అంతస్తులో ఉన్న లేబర్ క్యాంప్ కిచెన్‌లో చెలరేగిన మంటలు.. క్షణాల్లో మిగతా గదులకు వ్యాపించాయి.
ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో స్పందించిన ఆయన.. ‘కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మంది మృతిచెందినట్టు, 50 మంది గాయపడినట్టు నివేదికలు వస్తున్నాయి.. కువైట్‌లోని భారత రాయబారి ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు.. తదుపరి వివరాల కోసం ఎదురుచూస్తున్నాం.. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.. ఈ విషయంలో సంబంధిత అందరికీ మా ఎంబసీ పూర్తి సహాయాన్ని అందజేస్తుంది.’’ అని ట్వీట్ చేశారు.