ఇప్పటికే కల్తీ ఆహారం వార్తలతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే భయమేస్తుండగా.. తాజాగా యూపీలో ఓ సెలూన్ నిర్వాహకుడు చేసిన పని వెగటు పుట్టిస్తోంది. కస్టమర్ ముఖానికి మసాజ్ చేసిన బార్బర్ అమ్జాడ్.. తన అరచేతిలో ఉమ్మి వేసుకొని అతడి ముఖానికి రాశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ బార్బర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో మాత్రం ఇప్పటిది కాదు. రెండేళ్ల కిందటిది. ఉత్తర్ ప్రదేశ్‌లోని షామ్లీలో 2022 మేలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మళ్లీ వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోలో సెలూన్ నిర్వాహకుడు అమ్జాద్ తన షాపుకు వచ్చిన ఓ కస్టమర్‌కు ఫేసియల్ చేస్తుండటం కనిపిస్తోంది. అమ్జాద్ అతడి ముఖానికి ఫేసియల్ క్రీములు రాసి మసాజ్ చేశాడు. క్రీములు రాయడంతో ఆ కస్టమర్ తన కళ్లు మూసుకొని ఉన్నాడు. అలాంటి సమయంలో అమ్జాద్ తన అరచేతిలోకి ఉమ్మి తీసుకొని అతడి ముఖానికి రాశాడు. కస్టమర్ కళ్లు మూసుకొని ఉండటంతో అమ్జాద్ చేసిన నీచపు పనిని గమనించలేకపోయాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫేస్‌బుల్‌లో పోస్టు చేయడం, ఆ తర్వాత అది వైరల్‌గా మారడంతో ఆ తర్వాత అతడి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు నాటి కథనాల్లో రాశారు. ప్రస్తుతం ఆహారం, తినుబండారాల కల్తీకి సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో సెలూన్ జరిగిన ఈ దారుణానికి సంబంధించిన ఈ పాత వీడియో మళ్లీ వైరల్ అవుతున్నట్లుంది!