బంగారం అనేది అత్యవసర సమయంలో.. క్లిష్ట పరిస్థితుల్లో.. భౌగోళిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తిన సమయాల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే బంగారం ధరలు ఇటీవల ఏప్రిల్- మే నెలల్లో విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంతో అంతకుముందు వరుసగా 18 నెలలు బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేసిన చైనా ఒక్కసారిగా మే నెలతో దానికి బ్రేకులు వేసింది. దీంతో మళ్లీ గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి దిగొచ్చాయి. గత రెండు నెలలతో పోలిస్తే ఇప్పుడు రేట్లు భారీగానే తగ్గాయని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలోనే చైనా మళ్లీ బంగారం కొనుగోళ్లు జరపొచ్చని తెలుస్తోంది.
చైనా వరుసగా 18 నెలలు బంగారాన్ని కొనుగోలు చేసి .. నిల్వల్ని పెంచుకున్నట్లు స్వయంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గణాంకాలే చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మే నెలలో మాత్రం ఇవి ఏం మారలేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం అయ్యాయి. చైనా బంగారం కొనుగోళ్లకు విరామం ఇచ్చిందని.. సింగపూర్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ప్రీసియస్ మెటల్స్ కాన్ఫరెన్స్ సైడ్‌లైన్స్‌లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ డేవిడ్ టైట్ స్వయంగా రాయిటర్స్ వార్తా సంస్థతోనే చెప్పారు. కానీ వాళ్లు వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉన్నారని.. స్పాట్ గోల్డ్ రేట్లు మళ్లీ ఔన్సుకు 2200 డాలర్ల స్థాయికి పడిపోతే మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించొచ్చని అభిప్రాయపడ్డారు.
అయితే స్పాట్ గోల్డ్ ధరలు ఇటీవల ఔన్సుకు 2400 డాలర్ల స్థాయి దాటి కూడా ట్రేడయ్యాయి. చైనా బంగారం కొనుగోళ్లకు బ్రేక్ ఇవ్వడంతో ఒక్కరోజులో భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు మూడున్నరేళ్లలో ఒక్కరోజు అత్యధిక పతనం ఇదే కావడం గమనార్హం. మే 20న వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తత పరిస్థితుల నడుమ స్పాట్ గోల్డ్ రేటు 2449.89 డాలర్ల అత్యధిక స్థాయిని తాకింది. తర్వాత వరుసగా తగ్గుకుంటూ వచ్చింది.
దేశీయంగా కూడా ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది మళ్లీ అంతర్జాతీయంగా బంగారం ధరల తగ్గింపునకు దారి తీస్తుందా లేదా పెంచుతుందా అనేదానిపై మార్కెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల బంగారం కొనుగోళ్లను ఆపడంతో రేట్లు దిగిరాగా.. మళ్లీ ఇప్పుడు చైనా గోల్డ్ కొనుగోళ్లు చేపడితే.. రేట్లు మళ్లీ పెరుగుతాయనే వాదనా వినిపిస్తోంది. దీంతో ఇది భారత మార్కెట్‌పైనా ఎఫెక్ట్ చూపిస్తుంది.