ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రాసలీలల గురించి తరుచూ ఏదో ఒక వార్త బయటపడుతూనే ఉంటుంది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్యతో మస్క్ సంబంధం పెట్టుకోవడంతో వారి ఇద్దరూ విడిపోయారని ఇటీవల ఓ మీడియా కథనం వెల్లడించింది. తాజాగా, మస్క్ లైంగిక సంబంధాలపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలువరించింది. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో ఆయన సంబంధాలు పెట్టుకున్నారని అందులో పేర్కొంది. ఇంటర్న్‌షిప్ కోసం వచ్చిన తన కంటే వయసులో 20 ఏళ్లు చిన్నదైన యువతితో డేటింగ్ చేసిన మస్క్.. సిసిలీలోని ఓ రిసార్టుకు తీసుకెళ్లి శృంగారంలో పాల్గొన్నారని తెలిపింది. ‘ఇంటర్న్‌గా చేరిన కొద్ది రోజులకే ఎలాన్ మస్క్ కన్ను ఆ యువతిపై పడింది. తరచుగా అర్థరాత్రుళ్లు ఆ యువతికి మెసేజ్ లు పంపుతుండేవాడు’ అని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
తనతో పిల్లల్ని కనాలంటూ స్పేస్‌ఎక్స్‌లోని ఉద్యోగినిని కూడా మస్క్ కోరితే.. అందుకు ఆమె నిరాకరించినట్టు కథనంలో వెల్లడించింది. తన ప్రతిపాదనకు అంగీకరించలేదనే అక్కసుతో ఆమె పనితీరు బాగులేదని ఫిర్యాదులు చేశారని, చివరకు 2013లో ఆమె సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయిందని వివరించింది. అలాగే, 2014లో ఇంకో మహిళా సిబ్బందితో మస్క్ నెలరోజులపాటు లైంగిక బంధంలో ఉన్నారని, తర్వాత వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఆమె ఉద్యోగం మానేసినట్టు చెప్పింది.
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్యతో ఆయనకు అఫైర్ ఉన్నట్లు, ఓ పార్టీలో ఆమెతో కలిసి కెటామైన్ డ్రగ్ తీసుకున్నట్లు గత నెలలో న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. సెర్గీ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి మస్క్‌తో సంబంధమే కారణమని పేర్కొంది. సెర్గీబ్రిన్, ఎలాన్ మస్క్ ఒకప్పుడు ప్రాణస్నేహితులు. టెస్లా రూపొందించిన తొలి మోడల్ కారును అందుకున్న వాళ్లలో సెర్గీ కూడా ఒకరు. కాగా, మస్క్‌పై చేసిన ఆరోపణలను స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ కొట్టిపారేశారు. ఎలాన్ మస్క్‌పై తప్పుడు ప్రచారం చేసేందుకే ఈ కథనాన్ని ప్రచురించారని ఆయన మండిపడ్డారు. అదంతా అబద్ధమని, అందర్నీ తప్పుదారి పట్టించేందుకు చేసే ప్రయత్నమని పేర్కొన్నారు..తనకు పరిచయం ఉన్న వారి అందరికంటే మస్క్ ఎంతో మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. ఇదిలా ఉండగా.. కాలేజీ రోజుల నుంచే ప్రేమాయణం నడిపారు. జెన్నీఫర్ గ్వైన్ అనే యువతితో డేటింగ్ చేశారు. ఈమె మస్క్‌తో గడిపిన సమయంలో మధుర జ్ఞాపకాల్లా నిలిచిన చిత్రాలను గతేడాది వేలానికి పెట్టారు. ఇది అప్పట్లో సంచలనం అయ్యింది.