వంగలపూడి అనిత.. టీడీపీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్. టీచర్ స్థాయి నుంచి హోం మంత్రి స్థాయికి ఎదిగిన పవర్ ఫుల్ ఉమెన్. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన తెలుగు మహిళ. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసినా.. వెనక్కి తగ్గని ఐరన్ లేడీ. పాయకరావు పేట నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు వంగలపూడి అనిత. ఈ క్రమంలో గత ఐదేళ్లలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
డీజీపీ ఆఫీసులోకి అనుమతించని నాటి నుంచి.. అదే డీజీపీ ఆఫీసులోకి ప్రోటోకాల్‌తో తీసుకెళ్లే స్థాయికి ఎదిగారు అనిత. దీనిపై భావోద్వేగానికి గురయ్యారు. హోం మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అప్పటి సంగతిని గుర్తు చేసుకున్నారు.
"ఇదే డీజీపీ ఆఫీసులోకి నేను ఎన్నో సార్లు వెళ్తూ ఉంటే.. రోడ్డు మీదే ఆపేశారు. నన్ను మభ్యపెట్టారు. కనీసం అడిషినల్ డీజీపీ దగ్గరకు తీసుకెళ్లమని అడిగినా వినలేదు. ఐపీఎస్ అధికారి దగ్గరకు తీసుకెళ్లమని చెప్పినా వినలేదు. బయట జరుగుతున్న అఘాయిత్యాలపై రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పా. కానీ.. అక్కడకు తీసుకెళ్లి హెడ్ కానిస్టేబుల్ చేతికో, ఎస్సై చేతికో రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. ఆ రోజు రిప్రజెంటేషన్ అక్కడే చింపేసా. అప్పుడే చెప్పా. మా ప్రభుత్వం వచ్చాక ఇదే ఆఫీసులోకి ప్రోటోకాల్‌తో మీరే నన్ను తీసుకెళ్తారని చెప్పా. మా చంద్రబాబు గారి తోడ్పాటుతో ఇప్పుడదే జరిగింది".. అంటూ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంగలపూడి అనిత గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై దాడులు, గంజాయి, డ్రగ్స్ రవాణా, మహిళలపై అత్యాచారాలు ఇలాంటి అనేక ఘటనల సమయంలో టీడీపీ తరుఫున పోరాటం చేశారు అనిత. ఈ క్రమంలోనే అనేకసార్లు పోలీసులను కలిసి వీటిపై వినతి పత్రాలు సమర్పించారు. అలాగే డీజీపీని కలిసేందుకు ప్రయత్నించగా.. అప్పట్లో కుదరలేదు. ఈ నేపథ్యంలో అప్పటి సంగతిని గుర్తుచేసుకున్న అనిత.. తనను రోడ్డుమీద ఆపేసిన పోలీసులే.. ప్రోటోకాల్‌లో లోనికి తీసుకెళ్తున్నారంటూ ఉద్వేగానికి గురయ్యారు.
దళిత వర్గానికి చెందిన తనకు సీఎం చంద్రబాబు హోం మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని.. చంద్రబాబు అప్పగించిన గురుతర బాధ్యతను ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు.