సీనియర్ సిటిజెన్లకు డబ్బుల్ని పొదుపు చేసి దానిపై స్థిర వడ్డీ పొందేందుకు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్. రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు. మలి వయసులో వారికి ఇది ఆర్థికంగా సహాయపడుతుంది. రెగ్యులర్ సిటిజెన్లతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ వస్తుంది. దాదాపు చాలా బ్యాంకుల్లో ఇదే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను గరిష్ట స్థాయిల్లో ఉంచినప్పటి నుంచి చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ బ్యాంకులు సహా దేంట్లో సీనియర్ సిటిజెన్లకు అధిక వడ్డీ వస్తుందనేది చూద్దాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు..
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.75 శాతం వడ్డీ అందిస్తోంది. రూ. 3 కోట్లకు లోబడిన డిపాజిట్లపై ఇది వర్తిస్తుంది. అత్యధికంగా 18-21 నెలల ఎఫ్డీ పై వడ్డీ ఉంది. 2024, జూన్ 19 నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. లక్ష జమ చేసినవారికి రూ. 11,176 వడ్డీ వస్తుంది.
బంధన్ బ్యాంక్ వడ్డీ రేట్లు..
ఈ బ్యాంకులో సీనియర్ సిటిజెన్లకు 3.75 శాతం నుంచి గరిష్టంగా 8.35 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఏడాది డిపాజిట్లపై అత్యధికంగా 8.35 శాతం వడ్డీ ఉంది. జూన్ 15 నుంచి ఇది వర్తిస్తుంది. లక్ష జమ చేస్తే రూ. 7,855 అందుతుంది.
ఇండస్‌ఇండ్ బ్యాంకులో 4 నుంచి 8.25 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి ఎఫ్డీపై అధిక వడ్డీ ఉంది. మే 27 నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. ఏడాది ఎఫ్‌డీపై రూ. 7,765 వడ్డీ అందుతుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4.60 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. 1500 రోజుల టెన్యూర్‌పై అత్యధికంగా 9.10 శాతం వడ్డీ వస్తుంది. జూన్ 7 నుంచి ఇది వర్తిస్తుంది. 1500 రోజుల్లో ఇక్కడ రూ. 37,400 వడ్డీ అందుకుంటారు.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 1001 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా 9.50 శాతం వడ్డీ అమల్లో ఉంది. మే 1 నుంచి ఇది అమల్లో ఉంది. ఇక్కడ మెచ్యూరిటీకి వడ్డీ రూ. 26,125 వస్తుంది.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో అయితే 546-1111 రోజుల డిపాజిట్లపై అత్యధికంగా 9.50 శాతం వడ్డీ వస్తుంది. ఇది జూన్ 7 నుంచి అమలవుతోంది. 546 రోజులు డిపాజిట్ చేస్తే రూ. 14,410 వడ్డీ అందుతుంది.
ఐసీఐసీఐ బ్యాంకులో చూసినట్లయితే 15 నెలల నుంచి రెండేళ్ల వ్యవధి డిపాజిట్లపై అత్యధికంగా 7.75 శాతం వడ్డీ వర్తిస్తుంది. దీంట్లో రూ. లక్ష జమ చేస్తే సీనియర్ సిటిజెన్లకు 15 నెలల్లో చేతికి రూ. 9,244 వడ్డీ వస్తుంది.
యాక్సిస్ బ్యాంకులో అత్యధికంగా 17-18 నెలల వ్యవధి డిపాజిట్లపై 7.85 శాతం వడ్డీ ఉంది. దీంట్లో లక్ష జమ చేస్తే మెచ్యూరిటీకి చేతికి రూ. 1,10,678 అందుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 400 రోజుల టెన్యూర్ డిపాజిట్‌పై 7.75 శాతం వడ్డీ ఉంది. ఇది జూన్ 10 నుంచి అమల్లో ఉంది. రూ. లక్ష డిపాజిట్ చేస్తే 400 రోజుల్లో వీరికి రూ.8,480 వడ్డీ వస్తుంది.