విమాన ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. తక్కువ ధరలోనే విమాన ప్రయాణం చేయొచ్చు. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ఆకాశ ఎయిర్ సంస్థ ఫ్లైట్ టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పే డే సేల్ పేరుతో భారీ తగ్గింపులో విమాన ప్రయాణం కల్పిస్తోంది. ఈ స్పెషల్ సేల్ ఇప్పటికే మొదలైంది. జులై 1, 2024 వరకు టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే మీరు సోమవారం రాత్రి లోపు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2024 వరకు ఎప్పుడైనా మీరు ప్రయాణం చేయవచ్చు. వచ్చే మూడు నెలల్లో విమాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
పే డే సేల్‌లో భాగంగా డొమెస్టిక్ ప్రయాణాలపై 20 శాతం వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది ఆకాశ ఎయిర్. ఆ కంపెనీకి చెందిన వెబ్‌సైట్, మొబైల్ యాల్ సహా గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా సైతం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాల టికెట్లు ఉంటాయి. PAYDAY ప్రోమో కోడ్ ఉపయోగించి 'సేవర్', 'ఫ్లెక్సీ' టికెట్లపై ఈ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యటన, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలనుకునే వారు జులై 1 లోపు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
'ఆకాశ ఎయిర్ డొమెస్టిక్ నెట్‌వర్క్ పరిధిలోని 22 గమ్యస్థానాలకు ప్రయాణించేందుకు కస్టమర్లు సేవర్, ఫ్లేక్సీ టికెట్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపు పొందవచ్చు. www.akasaair.com, కంపెనీ మొబైల్ యాప్, గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ల దగ్గర ఈ నెల 28 నుంచి జులై 1 వరకు ఈ ఆఫర్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.' అని ఆకాశ ఎయిర్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఆఫర్ కేవలం దేశీయ మార్గాలకు వర్తిస్తుంది. అలాగే జుల్ 5, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 మధ్య మాత్రమే ప్రయాణం చేయవచ్చు. అందులోనూ బ్లాకౌట్ పీరియడ్ ఆగస్టు 15 నంచి ఆగస్టు 19 వరకు, సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఉంటుంది. ఆయా రోజుల్లో ఈ డిస్కౌంట్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఉండదు.
మరోవైపు.. ఈ పే డే సేల్ ద్వారా అడల్ట్, చైల్డ్ కేటగిరీ వారికే టికెట్లపై 20 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కానీ, ఆర్మీ సిబ్బంది, డాక్టర్లు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు ఈ ఆఫర్ ఉండదు. అలాగే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీల్ ఛార్జీలు, ఎక్సేస్ బ్యాగేజీ ఛార్జీలు, ప్రభుత్వ ఛార్జీలకు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ వెల్లడించింది. అలాగే ఇతర ప్రోమో కోడ్స్, ఆఫర్స్ వంటివి ఉపయోగించుకోవడానికి లేదని తెలిపింది. అలాగే గ్రూప్ బుకింగ్స్ చేసుకునేందుకు కుదరదు.