అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించి కొన్ని రోజులుగా చర్చ కొనసాగుతోంది. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి ముహూర్తం దగ్గరపడుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది అంబానీ కుటుంబం. అయితే, ఈసారి ప్రీవెడ్డింగ్ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు.
ఈ ప్రీవెడ్డింగ్‌లో చేపట్టే సామూహిక వివాహాలకు జులై 2వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ముంబై, పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో ఈ వివాహాలు జరగనున్నాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన పలు జంటలకు ఈ కార్యక్రమం వేదికగా సామూహిక పెళ్లిళ్లు జరిపించనుంది అంబానీ కుటుంబం. ఈ సామూహిక వివాహ వేడుకలకు ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త వీరెన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్‌తో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులై 12, 2024 రోజున జరగనుంది. వీరి వివాహానికి బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. జులై 12న శుభ్ వివాహ్, జులై 13 వ తేదీన శుభ్ ఆశీర్వాద్, జులై 14వ తేదీన మంగళ్ ఉత్సవ్ ఉంటాయి. మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి.
మరోవైపు.. అనంత్- రాధికల పెళ్లి ఆహ్వాన పత్రికలను అతిథులకు అందిస్తోంది అంబానీ కుటుంబం. ఈ క్రమంలో వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్‌గా మారింది. తొలి కార్డును కాశీ విశ్వనాథుని పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు నీతా అంబానీ. ఆ తర్వాత ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులకు అందించారు. పెళ్లి కార్డు ధర రూ.6.5 లక్షల వరకు ఉంటుందని అంచనా. అందులో వెండి ఆలయం, బంగారంతో చేసిన విగ్రహాలు వంటివి ఉన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది.