కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో రోజుల నుంచి డీఏ బకాయిలు కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ త్వరలోనే శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్-19 విజృంభించిన సమయంలో 18 నెలలకు సంబంధించిన డియర్‌నెస్ రిలీఫ్, డియర్‌నెస్ అలవెన్స్ నిధులను ఆపేసింది కేంద్రం. ఇప్పటి వరకు వారికి అందించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరోసారి అధికారం చేపట్టిన ఎన్డీయో సర్కారు జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా మరోసారి ఉద్యోగులు, పెన్షనర్లు ఆశలు పెట్టుకున్నారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ నేషనల్ కౌన్సిల్ (స్టాఫ్ సైడ్) సెక్రెటరీ శివ గోపాల్ మిశ్రా. ' కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలను మీ దృష్టికి తీసుకురావడం జేసీఎం సెక్రెటరీగా నా బాధ్యత.' అని లేఖలో పేర్కొన్నారు. 18 నెలల బకాయిలు విడుదల చేయడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కల్పించినట్లవుతుందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
గతంలో భారతీయ ప్రతిక్షా మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రెటరీ ముకేశ్ సింగ్ సైతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి లేఖ రాశారు. 2020, జనవరి నుంచి 2021 జూన్ వరకు ఇవ్వాలని 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు విడుదల చేయాలని లేఖలో కోరారు. కరోనా వైరస్ కనుమరుగై ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న క్రమంలో డీఆర్, డీఏ 3 విడతల్లో ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి తమ బాధ్యతలను నిర్వర్తించారని, మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటన చేయాలని కోరారు. అయితే అలాంటి ప్రకటనేమీ చేయలేదు కేంద్ర ప్రభుత్వం.
అలాగే ఈ విషయంపై లోక్‌సభ వేదికగా ఓ సభ్యుడు ప్రశ్నించగా అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 లో కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, 18 నెలలకు సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలను విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చన్నారు. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు పంజుకుంటున్న క్రమంలో ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. వచ్చే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేయాలని కోరుతున్నారు.