బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేద్దామని ప్లాన్ చేస్తున్న వారికి అలర్ట్. ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. కొత్త వడ్డీ రేట్లను జులై 3వ తేదీ నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. అలాగే స్పెషల్ టెన్యూర్ డిపాజిట్) స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.70 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. మరి ఇందులో రూ.1 లక్ష జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత ఎంతొస్తుంది? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం 17 నెలల నుంచి 18 నెలల టెన్యూర్ గల ప్రత్యేక పథకం ద్వారా జనరల్ కస్టమర్లకు 7.2 శాతం మేర వడ్డీ కల్పిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 7.70 శాతం మేర వడ్డీ అందిస్తోంది. ఇందులో రూ.1 లక్ష జమ చేసినట్లయితే జనరల్ కస్టమర్లకు 7.20 శాతంతో 18 నెలల టెన్యూర్‌పై ఎంచుకుంటే ఎంతొస్తుందో తెలుసుకుందాం. 18 నెలల తర్వాత వడ్డీ రూ. 10,800 వరకు లభిస్తుంది. అసలు, వడ్డీ కలిపితే రూ.1,10,800 వరకు లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 18 నెలల తర్వాత అసలు వడ్డీ కలిపి రూ. 1,11,550 వరకు లభిస్తాయి.
యాక్సిస్ బ్యాంక్ లేటెస్ట్ వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3 శాతం వడ్డీ ఇస్తోంది.
30 రోజుల నుంచి 45 రోజులకు 3.50 శాతం, 46 రోజుల నుంచి 60 రోజులకు 4.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
61 రోజుల నుంచి 3 నెలలోపు 4.50 శాతం, 3 నెలల నుంచి 3 నెలల 24 రోజులకు 4.75 శాతం
3 నెలల 25 రోజుల నుంచి 6 నెలల వరకు 4.75 శాతం వడ్డీ ఇస్తోంది.
6 నెలల నుంచి 9 నెలలలోపు 5.75 శాతం, 9 నెలల నుంచి ఏడాదిలోపు 6 శాతం వడ్డీ ఇస్తోంది.
ఏడాది నుంచి 15 నెలల వరకు 6.70 శాతం, 15 నెలల నుంచి 17 నెలల వరకు 7.10 శాతం వడ్డీ అందిస్తోంది.
17 నెలల నుంచి 18 నెలలకు 7.20 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
18 నెలల నుంచి 5 ఏళ్లలోపు అయితే 7.10 శఆతం వడ్డీ ఇస్తోంది.
5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఆయా టెన్యూర్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ అందిస్తోంది.