ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నారులు, టీనేజర్లు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ ప్లేయర్ కోర్టులోనే గుండెపోటుకు గురై కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో చోటుచేసుకుంది. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ ఝజీ.. కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జపాన్ ఆటగాడు కజుమా కవానోతో ఝాంగ్ ఝజీ తలపడుతున్నాడు. తొలి గేమ్ మొదలై కొద్దిసేపటికే అతడు కోర్టులో కుప్పకూలిపోయి విలవిలలాడిపోయాడు. ఏమైందోనని అతడి కోచ్.. కోర్టులోకి వచ్చి చూసిన తర్వాత ఫిజియో వచ్చి అతడికి ప్రాథమిక చికిత్స చేశారు. అయితే, తోటి ఆటగాడు గిలగిలా కొట్టుకుంటున్నా.. జపాన్ ప్లేయర్ మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డాడు. తన రాకెట్‌ను బ్యాగులో పెట్టి.. తాపీగా నెట్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు తప్పా.. అతడి దగ్గరకు మాత్రం రాలేదు.
ప్లేయర్ కోర్టులో కుప్పకూలిపోయిన కొద్దిసేపటికి వైద్య సిబ్బందిని కోర్టులోకి రిఫరీ అనుమతించాడని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఝాంగ్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. అయితే, అతడి పరిస్థితి క్రమంగా విషమించి కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. అతడ్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ‘ఝాంగ్ ఝాజీ హఠాత్తుగా గుండెపోటుకు గురయి చనిపోయాడు’ అని ఇండోనేషియా బ్యాండింటన్ అసోసియేషన్ ప్రకటించింది.
బ్యాడ్మింటన్ ప్రపంచం ఓ గొప్ప ప్రతిభావంతుడిపై ప్లేయర్‌ను కోల్పోయిందని బ్యాడ్మింటన్ ఆసియా విచారం వ్యక్తం చేసింది. చిన్నవయసులో బ్యాడ్మింటన్ మొదలుపెట్టిన ఝాంగ్.. నాలుగేళ్ల వయసులో రాకెట్ పట్టాడు. తన ప్రతిభ, అంకితభావంతో ఆటలో నైపుణ్యం సాధించాడు. గతేడాది చైనా నేషనల్ యూత్ గేమ్స్‌లో ఝాంగ్‌కు గుర్తింపు వచ్చింది. దీంతో ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో చైనా తరఫున ఆడే అవకాశం అందుకున్నాడు. కానీ, ఇంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది.