ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన.. బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కస్టమర్లకు షాకింగ్ ప్రకటన అని చెప్పొచ్చు. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. దీనినే రుణ ఆధారిత వడ్డీ రేట్లుగా పరిగణిస్తుంటారు. జులై 9న బ్యాంక్ ఈ మేరకు ఎక్స్చేంజీలకు సమాచారం అందించింది. ఇప్పుడు కొత్త ప్రకటన ప్రకారం.. ఈ బ్యాంకులో లోన్ వడ్డీ రేట్లు వేర్వేరు టెన్యూర్లపై చూస్తే కనీసం 8.15 శాతం నుంచి 8.90 శాతంగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి బ్యాంక్ కూడా ప్రతి నెలలో ఎంసీఎల్ఆర్ రేట్లను సవరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా ప్రకటన చేసింది.
అంతకుముందు ఈ దిగ్గజ బ్యాంకులో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.10 శాతంగా ఉండగా.. ఇప్పుడు 5 బేసిస్ పాయింట్ల మేర పెంచి దానిని 8.15 శాతానికి చేర్చింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటును 8.30 శాతం నుంచి ఇప్పుడు 8.35 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ మాత్రం స్థిరంగా 8.45 శాతం వద్ద ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.70 శాతానికి చేరింది. ఇక ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.90 శాతానికి పెరిగింది.
ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు రుణ గ్రహీతల నుంచి వసూలు చేసే కనీస వడ్డీ రేటు. ఇంతకంటే తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చేందుకు వీల్లేదు. అన్ని బ్యాంకుల్లో ఒకే విధానం ఉండాలన్న ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఈ విధానం తీసుకొచ్చింది. ఎక్కువగా ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్.. కస్టమర్ల లోన్లకు ముడిపడి ఉంటుంది. ఇక ఈ ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ పెరుగుతుందన్నమాట. దీంతో కస్టమర్ ఇకపై ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా FD రేట్లు..
ఈ ప్రభుత్వ బ్యాంక్ డిపాజిట్ రేట్ల విషయానికి వస్తే సాధారణ ప్రజలకు వారం రోజుల నుంచి గరిష్టంగా పదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం నుంచి గరిష్టంగా 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇదే సీనియర్ సిటిజెన్లకు చూస్తే 4.75 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ అందిస్తుంది. అత్యధికంగా రెగ్యులర్ సిటిజెన్లకు 2 నుంచి మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపై 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు ఇక్కడే 7.75 శాతం వడ్డీ ఇస్తోంది.