కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఇటీవలి బడ్జెట్‌లో రెండు కీలక ప్రకటనలు చేసింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోగా.. ఇదే సమయంలో కొత్త పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు కూడా అదే బాటలో పయనించింది. ఓల్డ్ టాక్స్ రిజిమ్‌ను యథాతథంగా ఉంచి.. కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు ప్రకటించింది. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్‌ను గతంలో రూ. 50 వేలుగా ఉండగా.. రూ. 75 వేలకు పెంచింది. ఇంకా.. పన్ను శ్లాబుల్ని మార్చేసింది. దీంతో గతంతో పోలిస్తే పన్ను ఆదా కాస్త ఎక్కువ చేసుకునే వెసులుబాటు కలిగింది. కొత్త పన్ను శ్లాబుల ప్రకారం.. రూ. 6-7 లక్షలు, రూ. 9-10 లక్షల బ్రాకెట్లోని ఆదాయం ఉన్న వారికి తక్కువ పన్ను పడనుంది. ఇంకా.. అధిక ఆదాయం కలిగిన వారు కూడా పన్ను శ్లాబుల మార్పుతో పన్ను తగ్గించుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు 7 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 12 లక్షలు, 20 లక్షల ఆదాయం ఉన్న వారు ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకుందాం.
కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం గతంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలు కలుపుకొని మొత్తం రూ. 7.50 లక్షల ఆదాయంపై రూపాయి చెల్లించాల్సిన పని ఉండేది కాదు. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలకు పెంచగా.. రూ. 7.75 లక్షల వరకు పన్ను పడదన్నమాట. ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది.
సవరించిన పన్ను శ్లాబుల ప్రకారం.. ఇప్పుడు రూ. 10 లక్షల ఆదాయం ఉంటే గతంలో రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో అయితే పన్ను రూ. 52,500 గా ఉండేది. ఇప్పుడు అది రూ. 42,500 కు తగ్గింది. అంటే రూ. 10 లక్షల ఆదాయంపై రూ. 42,500 టాక్స్ చెల్లించాలన్నమాట. ఇక్కడ రూ. 10 వేలు ఆదా అవుతుందని చెప్పొచ్చు. ఇదే విధంగా రూ. 12 లక్షల ఆదాయంపై చూస్తే అంతకుముందు పన్ను రూ. 82,500 చెల్లించాల్సి వస్తుండగా.. శ్లాబుల్ని సవరించిన తర్వాత రూ. 68,750 పన్ను పడుతుందని చెప్పొచ్చు. దీని ద్వారా రూ. 13,750 ఆదా చేసుకోవచ్చు. రూ. 20 లక్షల వార్షికాదాయం ఉన్న వారు అంతకుముందు రూ. 2.85 లక్షలు టాక్స్ చెల్లించాల్సి వచ్చేది. శ్లాబులు మారిన నేపథ్యంలో ఇది ఇప్పుడు రూ. 2,67,500 కు తగ్గుతుంది. ఇక్కడ అత్యధికంగా రూ. 17,500 పన్ను ఆదా అవుతుందన్నమాట.