తమిళనాడుకు చెందిన యువ స్పిన్నర్, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఆర్.సాయి కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు బీసీసీఐ సెలక్టర్లకు ఓ పరోక్ష ఛాలెంజ్ విసిరాడు. ప్రస్తుతం దేశంలో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్లలో తాను ఒకడినని, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడాలని వ్యాఖ్యానించాడు. అవకాశం వస్తే అద్భుత ప్రదర్శన చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. మరో రెండు వారాల్లో దులీప్ ట్రోఫీ, ఆ తర్వాత భారత్-బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో అతడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
“నేను ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడినని నమ్ముతున్నా. నన్ను కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో ఆడించండి. ఆడేందుకు నేను సిద్దంగా ఉన్నా. మ్యాచ్ ఆడే విషయంపై నేను పెద్దగా ఆందోళన చెందను. నేను రవీంద్ర జడేజా కలిసి దులీప్ ట్రోఫీలో ఆడబోతున్నా. గతంలో మేమిద్దరం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాం. కానీ సుదీర్ఘ ఫార్మాట్‌లో మేమిద్దరం ఎప్పుడూ కూడా కలిసి ఆడలేదు. కాబట్టి దులీప్ ట్రోఫీ సందర్భంగా జడేజాతో ప్రయాణం చేసి.. విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు నేను మానసికంగా సిద్ధంగా ఉన్నా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి” అని సాయి కిషోర్ వ్యాఖ్యానించాడు.
కాగా సెప్టెంబర్ 5 నుంచి దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే నాలుగు జట్లను ప్రకటించింది. అందులో సాయి కిషోర్ టీమ్-బీలో ఉన్నాడు. ఈ జట్టులో సాయి కిషోర్‌తో పాటు భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహల్‌లు కూడా ఉన్నారు. రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, యశస్వీ జైశ్వాల్‌లు కూడా ఇదే జట్టులో ఉన్నారు.
దులీప్ ట్రోఫీ పూర్తయ్యాక.. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 టెస్టు సిరీస్ జరగనుంది. దులీప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా టెస్టు సిరీస్ కోసం జట్టు ఎంపిక ఉండనుందని.. బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. దీంతో ఈ ట్రోఫీలో రాణించాలని ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. యంగ్ స్పిన్నర్ సాయి కిషోర్ కూడా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి మేటి స్పిన్నర్లతో కలిసి స్కిల్స్ పెంచుకునే అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని.. అప్పుడు తన సత్తా చూపిస్తానని సాయి కిషోర్ కోరుతున్నాడు.
దులీప్ ట్రోఫీ కోసం టీమ్-బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్,ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి,వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్, నారాయణన్ జగదీశన్,ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి