మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మంచి డైవర్సిఫైడ్ ఈక్విటీ పెట్టుబడి పథకాల కోసం చూస్తున్నారా? కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ఫండ్స్ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో మంచి అనుభవం ఉన్న నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సంస్థ కొత్త స్కీమ్ తీస్కొచ్చింది. నిప్పాన్ ఇండియా నిఫ్టీ 500 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. నిఫ్టీ 500 ఈక్వల్ వెయిట్ ఇండెక్సును ట్రాక్ చేస్తుంది.
ఈ కొత్త ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 21, 2024 రోజునే ప్రారంభమైంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు సెప్టెంబర్ 4, 2024 వరకు అవకాశం ఉంటుంది. ట్రాకింగ్ లోపాలకు లోబడి ఖర్చులకు ముందు నిఫ్టీ 500 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ద్వారా ప్రాతినిధ్యం వహించే సెక్యూరిటీల మొత్తం రాబడికి అనుగుణంగా పెట్టుబడి రాబడిని అందించడమే ఈ స్కీమ్ లక్ష్యమని పేర్కొంది కంపెనీ. ఈ పథకంలో పెట్టే డబ్బుల్లో 95-100 శాతం నిఫ్టీ 500 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్లకు కేటాయిస్తారు. 0-5 శాతం క్యాష్ ఈక్వలెంట్స్, మనీ మార్కెట్ వంటి ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.
ఈ స్కీమ్ పని తీరు అనేది నిఫ్టీ 500 ఈక్వల్ వెయిట్ టీఆర్ఐని బెంచ్‌మార్క్‌గా తీసుకుంటుంది. ఈ పథకాన్ని హిమాన్షు మాంజే నిర్వహిస్తారు. ఇందులో ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. ఈ కొత్త ఫండ్‌లో కనీస పెట్టుబడిని రూ.1000గా నిర్ణయించింది కంపెనీ. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. నిఫ్టీ 500 కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు పోర్ట్‌ఫోలియోలోని అన్ని స్టాక్స్‌కి సమానంగా పెట్టుబడులు కేటాయిస్తారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా వచ్చే రిస్క్‌ను ఈ పద్ధతి తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. భారత స్టాక్ మార్కెట్ వృద్ధిలో పాల్గొనేందుకు ఈ స్కీమ్ దోహదం చేస్తుందని పేర్కొంది.