హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొన్నేళ్లుగా వృద్ధి నమోదు చేస్తూ వస్తోంది. నగరం నలుమూలల ఇళ్లు, భూములు, అపార్ట్‌మెంట్లకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో గజం ధర రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతోంది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ఈ సమయంలో ఏకంగా 42 శాతం మేర క్షీణత నమోదుకానుందని అంచనా వేసింది. రియల్ ఎస్టేట్ సేవల సంస్థ ప్రాప్ ఈక్విటీ. గతంతో పోలిస్తే ఈసారి భారీగా పడిపోనున్నాయని తెలిపింది.
జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు 12,082 యూనిట్లు ఉండొచ్చని ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 20,658 యూనిట్లుగా నమోదైనట్లు తెలిపింది. గతేడాది గణాంకాలతో పోలిస్తే ఈసారి ఏకంగ 42 శాతం విక్రయాలు పడిపోనున్నాయని అంచనా వేసింది. ఈ క్రమంలో పలు విషయాలు చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. చెరువులను కబ్జా చేసి కట్టిన ఇళ్లపై తెలంగాణ సర్కార్ కొరడ ఝులిపిస్తోంది. వరుసపెట్టి కూల్చివేతలు చేపడుతోంది. ఇది కూడం ఇళ్ల విక్రయాలపై ప్రభావం చూపుతోందని రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి కొన్నాళ్ల పాటు హైడ్రా గుబులు ప్రజల్లో ఉంటుందంటున్నారు. దీంతో ఇల్లు కొనేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 18 శాతం మేర పడిపోయినట్లు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. ఈ సమయంలో మొత్తం 1,04,393 యూనిట్లు నమోదు కావచ్చని పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో 1,26,848 యూనిట్లు విక్రయమైనట్లు పేర్కొంది. నగరాల వారీగా చూస్తే ఢిల్లీలో 22 శాతం, నవీ ముంబైలో 4 శాతం వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది. ఇక బెంగళూరులో 26 శాతం పడిపోయి 13,355 యూనిట్ల విక్రయాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాదిలో సిలికాన్ సిటీలో 17,978 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. ఇక చెన్నైలో 18 శాతం క్షీణించి 4,634 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు. కోల్‌కతాలో 23 శాతం పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. పుణె నగరంలో 19 శాతం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 10 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపింది.