దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ గరిష్ఠం వద్ద ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా వంటి హెవీ వెయిట్ బ్యాంకుల దూకుడుతో సూచీలు ఆల్ టైమ్ గరిష్ఠం వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడి 84,928కి చేరుకుంది. నిఫ్టీ 148 పాయింట్లు ఎగిసి 25,939 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 85 వేలకు, నిఫ్టీ 26 వేలకు కొద్ది దూరంలో నిలిచాయి.లార్జ్ క్యాప్‌తో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 503 పాయింట్లు ఎగిసి 60,712 వద్ద, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 216 పాయింట్లు లాభపడి 19,548 వద్ద ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఆటో, పీఎస్‌యూ బ్యాంకు, ఫిన్ సర్వీసెస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియాల్టీ, ఎనర్జీ, ఇన్‌ఫ్రా రంగాలు లాభాల్లో ముగిశాయి. ఐటీ సూచీలు మాత్రమే నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ 30 ప్యాక్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌యూఎల్, అల్ట్రా టెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎన్టీపీసీ, నెస్లే టాప్ గెయినర్లు కాగా, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ టాప్ లూజర్లుగా నిలిచాయి.బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో 2,385 షేర్లు లాభాల్లో, 1,728 షేర్లు నష్టాల్లో ముగియగా, 120 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 476 లక్షల కోట్లకు పెరిగింది.