దేశంలో యూపీఐ పేమెంట్లకు అత్యంత ఆదరణ లభిస్తోంది. కిరాణ దుకాణాల నుంచి హాస్పిటల్ బిల్లుల వరకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఉపయోగించి చెల్లింపులు చేస్తున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన క్రమంలో క్రెడిట్ కార్డులతోనూ యూపీఐ పేమెంట్లు చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే, రూపే నెట్‌వర్క్ కార్డులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు తమ యూపీఐ ఐడీకి అనుసంధానం చేసుకుని పేమెంట్లు చేయవచ్చు. క్రెడిట్ కార్డు అంటే గడువు తేదీ లోపు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.లేదంటే భారీగా వడ్డీ, పెనాల్టీలు పడతాయి. నెల మొత్తం చేసిన యూపీఐ పేమెంట్లకు సంబంధించిన నగదును చివర్లో ఒక్కసారిగా చెల్లించడం కాస్త భారమనే చెప్పాలి.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. రూపే క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్ల బిల్లులను ఈఎంఐలుగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యూపీఐ బిజినెస్ ట్రాన్సాక్షన్లను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. యూపీఐ యాప్స్‌లో తమ ట్రాన్సాక్షన్ల హిస్టరీని యాక్సెస్ చేయడం ద్వారా రూపే క్రెడిట్ కార్డుతో చేసిన పేమెంట్లను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఈ కొత్త సేవలు పండగ సీజన్‌లో తమ కస్టమర్లకు సౌకర్యవంతమైన పేమెంట్ సేవలను అందిస్తుందని పేర్కొంది. ఈ ఈఎంఐ సేవలను టైర్-2, టైర్-3 సిటీల్లో వినియోగించుకోవచ్చని తెలిపింది. రూపే భాగస్వామ్యంతో యూపీఐ పేమెంట్లపై ఈఎంఐ ఫీచర్ తీసుకొచ్చినట్లు తాజాగా బీఓబీ కార్డ్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్ రవీంద్ర రాయ్ తెలిపారు.
యూజర్లు పర్సన్ టూ మెర్చంట్ ట్రాన్సాక్షన్లను ఈపీఎంలుగా కొనుగోలు చేసేటప్పుడే మార్చుకోవచ్చు. అందుకు ముందుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. పేమెంట్ కోసం బీఓబీ సీసీ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు పలు ఈఎంఐ ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో కన్వర్ట్ టూ ఈఎంఐ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీకు అనువైన ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలి. మరోవైపు.. పర్సన్ టూ మెర్చంట్ ట్రాన్సాక్షన్లను కొనుగోళ్లు పూర్తి చేసిన తర్వాత కూడా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. అందుకోసం ముందుగా యూపీఐ యాప్‌లో ట్రాన్సాక్షన్ హిస్టరీ పేజీలోకి వెళ్లాలి. మీరు ఏ ట్రాన్సాక్షన్లను ఈఎంఐలుగా మార్చుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. అప్పుడు మీ అర్హతలను సిస్టమ్ చెక్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ ఈఎంఐకి అర్హత సాధిస్తే అప్పుడు కస్టమర్లు బీఓబీ సీసీ ఈఎంఐ కన్వర్షన్ మోడ్ ఎంచుకోవాలి. మీకు అనువైన ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని పిన్ ద్వారా అథెంటికేట్ చేయాలి.