వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇంఛార్జి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదయ్యింది. కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టారు. సజ్జల భార్గవరెడ్డితో పాటు మరో ఇద్దరిపై సింహాద్రిపురం మండలానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన హరి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నిర్వహించే రాష్ట్రస్థాయి నేత అర్జున్‌రెడ్డి, ఇటీవలే పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్‌రెడ్డిపై కూడా కేసు నమోదైనట్లు పులివెందుల పట్టణ పోలీసులు వెల్లడించారు.
రవీందర్‌రెడ్డి ఐదేళ్లుగా టీడీపీ నేతలతో పాటు జగన్‌ను విమర్శించేవారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపైనా కేసు పెట్టారు. కాగా, ఇటీవల పులివెందుల వద్ద వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం 41ఏ కింద నోటీసులు ఇచ్చి వదలిపెట్టారు. మరో కేసు కింద అదుపులోకి తీసుకోవడానికి వెళ్తే అప్పటికే రవీందర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్న పోలీసులు.. శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
కాగా, ఇటీవల సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా, మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఏ పార్టీ వారైనా సరే ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టినా, వైసీపీకి చెందిన వారి ఆడబిడ్డలపై పోస్టులు పెట్టినా వదిలే ప్రసక్తేలేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తప్పును తప్పుగానే చూస్తామని,. తప్పు చేసిన వారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. మహిళల జోలికి వచ్చి, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెగేసి చెప్పారు. మనుషులు మనుషుల్లాగానే ఉండాలని, మృగాళ్లలా ప్రవర్తిస్తే వారి పట్ల ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.