కీలకమైన కేసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ సీఐడీ, ఏసీబీ అధికారులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ పోలీసింగ్ ముగిసిందని గ్రహించాలని... తప్పు చేసిన వ్యక్తులకు వంత పాడే రోజులు పోయాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు పోలీసు వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ కోసం పని చేసిందన్నారు. ఇప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పని చేయాలని, అయితే మార్పు ఇంకా కనిపించడం లేదని అన్నారు. ‘భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, మద్యం కుంభకోణం, మైనింగ్ అక్రమాలు, రేషన్ బియ్యం మాఫియా, చివరికి ఆడుదాం ఆంధ్రాలోనూ దోపిడీ చేశారు.
ప్రజల సంపదను ప్రభుత్వ పెద్దలే దోచేయడం దారుణం. ఇటువంటి వ్యక్తులకు శిక్ష పడేలా చేయకుంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయినట్లే. గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో ఎంత అరాచకం జరిగిందో మీకు తెలుసు. వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. చుక్కలు పెట్టించి లాక్కొని, నిషేధిత జాబితాలో చేర్చి తక్కువ ధరకు తీసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని తగుల బెట్టేశారంటే ఇది గూండా రాజ్యమా? ఘటన జరిగినప్పుడు హెలికాప్టర్లో వెళ్లమని డీజీపీ, సీఐడీ ఏడీజీని పంపాను. ఆ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఇబ్బందేంటి.. జాప్యమెందుకు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘అక్కడ రాజకీయ సిఫారసులతో పది చేస్తే, సిబ్బంది సొంతంగా ఐదు చేశారు సర్. ఎన్వోసీల వివరాలు బయటికి వస్తాయనే తగుల బెట్టేశారు. అప్పుడున్న సిబ్బందిలో ఎక్కువమంది ఇలాంటివి చేశారు. అందుకే దర్యాప్తులో ఆలస్యం అవుతోంది. బాధ్యులను ఆధారాలతో జైలుకు పంపుతాం’ అని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ‘ఆధారాలు సేకరించండి. టెక్నాలజీ వినియోగించుకుని ఉచ్చు బిగించండి. ఇకపై ఎవరూ అక్రమాలు చేయడానికి సాహసించకూడదు. పోలీసుల పనితీరులో ఇంకా మార్పు రావాలి’ అని సీఎం సూచించారు.