పింక్ బాల్ టెస్టులో ఓటమి భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలపై గట్టి ప్రభావం చూపించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్ ఫలితంతో ఒక్కసారిగా మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో పది వికెట్ల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025లో ఆది నుంచి టీమిండియాదే అగ్రస్థానం. కానీ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ ఓడిపోవడం టీమిండియా అవకాశాలను సంక్లిష్టం చేసింది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లే ఫైనల్ చేరతాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంటేనే భారత్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు దక్కుతుంది. ఏ జట్టుతో సంబంధం లేకుండా భారత ఫైనల్ చేరాలంటే 4-0తో సిరీస్ గెలవాల్సి ఉంటుంది. కానీ రెండో టెస్టులో ఓటమితో పరిస్థితి మారిపోయింది. ఒక్క మ్యాచ్ ఓటమితో టీమిండియా మూడో స్థానికి పడిపోయింది. ఆస్ట్రేలియా అగ్రస్థానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా రెండో స్థానానికి చేరింది.
డబ్ల్యూటీసీ 2023-2025లో భారత జట్టు 16 టెస్టులు ఆడింది. అందులో 9 మ్యాచుల్లో గెలిచింది. 6 మ్యాచుల్లో ఓటమిపాలైంది. 1 టెస్టు డ్రాగా ముగిసింది. ప్రస్తుతం టీమిండియా 57.29 విజయశాతంతో మూడో ప్లేసులో ఉంది. ఆస్ట్రేలియా 60.71 విజయశాతంతో అగ్రస్థానానికి చేరింది. 59.26 విజయశాతంతో దక్షిణాఫ్రికా 2వ ప్లేసులో ఉంది. శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఫైనల్ బెర్తు కోసం ప్రధానంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో భారత్‌కు గట్టిపోటీ నెలకొంది. కాగా డబ్ల్యూటీసీలో భారత్‌కి ఇదే చివరి టెస్టు సిరీస్. మిగిలనవి మూడే మ్యాచ్‌లు. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో మరో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. దక్షిణాఫ్రికా కూడా పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. మరి తర్వాతి మ్యాచుల్లో భారత్ పుంజుకుని.. వరుసగా మూడో సారి ఫైనల్ చేరుతుందా? లేదా ఈసారి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.