బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో గెలిచి.. ఆత్మవిశ్వాసంతో రెండో టెస్టు బరిలోకి దిగిన భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. పింక్ బాల్ టెస్టులో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం 200 పరుగులు చేయలేకపోయారు. దీంతో పది వికెట్లు తేడాతో భారత్‌కు ఓటమి ఎదురైంది. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ ఫర్వలేదనిపించినా.. అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా హర్షిత్ రాణా రెండో టెస్టులో తేలిపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు బౌలింగ్ వేసిన రాణా.. ఒక్క వికెట్ తీయలేదు. అంతేకాదు పరుగులు కూడా వన్డే తరహాలు సమర్పించుకున్నాడు. దీంతో భారత జట్టు బౌలింగ్ కాస్త బలహీనంగా మారిపోయింది. బుమ్రా, సిరాజ్ రాణించినా.. వారి తర్వాత బాధ్యతలు తీసుకునే వారు లేకపోవడం ఆస్ట్రేలియా బ్యాటర్లు కలిసొచ్చింది. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు వచ్చేస్తున్నాడు మహమ్మద్ షమీ.
చీలమండ గాయంతో ఏడాది కాలంగా భారత జట్టుకు దూరమైన ఈ పేసర్.. ప్రస్తుతం భారత్‌లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. అతడు త్వరలోనే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిట్‌నెస్‌పై జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి నిరభ్యంతర పత్రం అందగానే మహమ్మద్ షమీ ఆస్ట్రేలియాకు పయనమవుతాడు. అయితే డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు నాటికి అతడు జట్టుతో చేరేది అనుమానమే. ఈ సిరీస్‌లో 4, 5 టెస్టులకు షమీ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తర్వాత షమీ ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే దేశవాళీ టోర్నీలో పునరాగమనం చేశాడు. ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే షమీ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు.
“మహమ్మద్ షమీకి సంబంధించిన భారత కిట్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో తాను ఆడే మ్యాచ్‌లు అయిపోయాక షమీ ఆసీస్ బయల్దేరుతాడు,” అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇటీవల ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన షమీ.. ఏకంగా ఆరు కేజీల బరువు తగ్గాడు. గత 13 రోజుల్లో 7 టీ20 మ్యాచ్‌లు ఆడి సత్తాచాటాడు. అతడి రాకతో భారత బౌలింగ్ మరింత పటిష్టం కానుంది. డిసెంబర్ 26 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది.