బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజయంతో ఆరంభించిన భారత్.. రెండో టెస్టులో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యంతో ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పది వికెట్లు తేడాతో పరాజయం పాలైంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటర్లు విఫలం కావడం భారత్ కొంపముంచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి 1-1తో సమమైంది.
ఓవర్ నైట్ స్కోరు 128/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు.. తొలి ఓవర్‌లోనే షాక్ ఇచ్చాడు స్టార్క్. ఈ మ్యాచ్‌లో భారత ఫ్యాన్స్‌కు ఉన్న ఏకైక ఆశాకిరణం రిషభ్ పంత్‌ను ఔట్ చేశాడు. దీంతో భారత జట్టు ఓటమి ఖరారైపోయింది. ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే పంత్ (28) పెవిలియన్ చేరాడు. దీంతో భారత్‌కు ఇన్నింగ్స్ తేడాతో ఓటమి తప్పదా అనిపించింది. కానీ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి పోరాడటంతో టీమిండియాకు ఇన్నింగ్స్ ఓటమి తప్పింది.
నితీశ్ రెడ్డి (42)కి మరే బ్యాటర్ కూడా సహకరించలేదు. 9వ వికెట్ రూపంలో నితీశ్ ఔట్ అయ్యాడు. అశ్విన్ (7), హర్షిత్ రాణా (0), సిరాజ్ (7)లు కూడా త్వరగానే ఔట్ కావడంతో భారత్ 175 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అంతకంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మెక్‌స్వీని (10), ఉస్మాన్ ఖవాజా (9)లు లాంఛనం పూర్తి చేశారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఆడిలైడ్ టెస్టులో ఆసీస్ గెలవడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఈ సిరీస్‌లో మూడో టెస్టు డిసెంబర్ 14న గబ్బా వేదికగా ప్రారంభం కానుంది.