పేరు మోసిన సీనియర్లు పనికిరాని చోట తెలుగు కుర్రాడు తన సత్తా చాటుతున్నాడు. వేల పరుగులు చేసిన ఆటగాళ్లు తేలిపోతున్న వేళ 22 ఏళ్ల యువ ఆల్ రౌండర్ పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్ లు ఆడితే.. మూడు ఇన్నింగ్స్ లో అతడే టాప్ స్కోరర్. ప్రత్యర్థి జట్టులో కాకలు తీరిన పేస్ బౌలర్లు ఉన్నారన్న భయం లేదు.. సర్రున దూసుకొచ్చే గులాబీ బంతితో ఆడుతున్నానన్న బెరుకు లేదు. తనలో కనిపించేది ఆత్మవిశ్వాసం.. తనకు కనిపించేది జట్టును నిలబెట్టడం. గులాబీ బంతితో టెస్టులో టీమ్ ఇండియా గూబ గుయ్ మంది.. తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్లెత్తేసిన భారత సీనియర్లు రెండో ఇన్నింగ్స్ లోనూ కాడి జారవిడిచారు. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ తీరుతోనే ఈ మ్యాచ్ చేజారుతుందని తెలిసిపోయింది. అయితే, 22 ఏళ్ల తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం పట్టు విడవలేదు. వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ కు నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడంపై చాలామందికి సందేహాలు వచ్చాయి. అప్పుడే ఏం చూసి తీసుకెళ్లారని విమర్శించినవారూ ఉన్నారు. కానీ, ఇప్పుడు అతడే లేకుంటే టీమ్ ఇండియా దారుణ పరిస్థితుల్లో ఓడేది అని స్పష్టం అవుతోంది.
ఒకటీ రెండుసార్లు ఆస్ట్రేలియా టూర్ చేసినవారికే మరోసారి టూర్ చేసేటప్పుడు పరుగులు సాధించడం కష్టం. కానీ, నితీశ్ కుమార్ కు మాత్రం అదేమీ అడ్డంకి కాలేదు. గత నెలలో జరిగిన తొలి టెస్టులో అతడు తొలిసారిగా బ్యాటింగ్ కు దిగి 41 పరుగులు చేశాడు. 150 పరుగులకు ఆలౌటైన టీమ్ ఇండియాలో ఇతడే టాప్ స్కోరర్. ఇక రెండో ఇన్నింగ్స్ లో 38 పరుగులతో నితీశ్ నాటౌట్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడంతో మరిన్ని పరుగులు చేసే అవకాశం లేకపోయింది. పింక్ బాల్ తో ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన రెండో టెస్టు మూడో రోజు ఆదివారం నాటికే పూర్తయింది. కనీసం రెండున్నర రోజులు కూడా జరగలేదు. అయితే, ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్. కోహ్లి, రోహిత్ వంటి వారు కనీసం నిలదొక్కుకునేందుకు తిప్పలు పడుతుండగా.. నితీశ్ మాత్రం అలవోకగా పరుగులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో స్టార్క్ బౌలింగ్ లాంగ్ ఆఫ్ మీదుగా కొట్టిన సిక్స్, బోలాండ్ బంతిని రివర్స్ స్వీప్ తో కొట్టిన సిక్స్ ను మరువలేం. అసలు తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా మూడు సిక్సులూ నితీశ్ వే.