ప్రస్తుతం భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ ల ఈ టెస్టు సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు జరగ్గా ఆసీస్, భారత్ 1-1తో సమంగా ఉన్నాయి. ఇక నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. దీంతో ఈ బాక్సింగ్-డే టెస్ట్ కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు.ఇతర ఆటగాళ్లతో పాటు వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ కూడా నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. అయితే, ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో తనకోసం మైదానానికి వచ్చిన దివ్యాంగ బాలుడిని చూసిన పంత్.. అతడిని కలిసేందుకు ముందుకొచ్చాడు. అంతే... పంత్‌ను చూసిన ఆ బాలుడు నడవలేని పరిస్థితిలోనూ పరుగులు తీశాడు. పంత్ ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని ఫొటో దిగాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అతడితో చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బ్యాట్‌తో బౌలర్లకు చుక్కల చూపించే పంత్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడని, రియల్ హీరో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.