దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ మరో కొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో 4000 పైచిలుకు పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోని బాబర్.. కొంత కాలం విరామం తర్వాత ఇప్పుడు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. రీఎంట్రీ ఇచ్చినా 11 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయినప్పటికీ.. ఈ 4 పరుగులతోనే అరుదైన ఘనత సాధించాడు. గురువారం ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 3 పరుగులు చేయడంతోనే టెస్టు క్రికెట్లో బాబర్.. 4 వేల రన్స్ మార్కును అందుకున్నాడు. దీంతో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు బాబర్ అజామ్ 56 టెస్టుల్లో 101 ఇన్నింగ్స్‌ల్లో 4001 పరుగులు చేశాడు. సగటు 43.49 గా ఉంది. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి.
రీఎంట్రీలోనూ తక్కువ రన్స్‌కే పెవిలియన్ చేరడంతో అజామ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా బాబర్ ఫామ్ లేమితో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కెప్టెన్సీ కూడా దూరమైంది. తర్వాత సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్‌లో విఫలమైనా.. వన్డే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించింది. ఇప్పుడు టెస్టుల్లో మళ్లీ పాత కథే పునరావృతం చేశాడు.
అయితే అజామ్‌పై ఓవైపు విమర్శలు వస్తున్నా.. మరోవైపు ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, వన్డే, టీ-20 ఇలా మూడు ఫార్మాట్లలోనూ 4000 రన్స్ పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్‌గా నిలవడమే ఇందుకు కారణం. 123 వన్డేల్లో 56.73 సగటుతో 5957 రన్స్ చేయగా.. 128 టీ-20ల్లో 4223 పరుగులతో ఉన్నాడు. వన్డేల్లో 19 సెంచరీలు, టీ-20 ల్లో 3 శతకాలు ఉన్నాయి.
ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో ఇలా ఇద్దరు మాత్రమే రికార్డుల్లో ఉండగా.. బాబర్ అజామ్ మూడో ఆటగాడు. మరో ఇద్దరు భారత్ స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మనే. ఈ ఇరువురూ.. 3 ఫార్మాట్లలో 4 వేలకుపైగా రన్స్‌తో ఉన్నారు. ఇప్పుడు వారి సరసన చోటు దక్కించుకున్నాడు బాబర్.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తొలి రోజే 13 వికెట్లు పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 57.3 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. కమ్రాన్ గులామ్ (54) టాప్ స్కోరర్. ఆమెర్ జమేల్ (28), మహ్మద్ రిజ్వాన్ (27) రన్స్ చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పాటర్సన్ 5 వికెట్లు తీయగా.. కార్బిన్ బాష్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా కూడా 82 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మార్‌క్రమ్ (47), కెప్టెన్ బవుమా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ టెస్టు సిరీస్ గెలిస్తే సౌతాఫ్రికా నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. పాకిస్థాన్ గెలిస్తే.. భారత్‌కు అవకాశాలు మెరుగవుతాయని చెప్పొచ్చు.