బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. భారత్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆటలో హాఫ్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్.. మూడంకెల మార్కు అందుకున్నాడు. దీంతో ఈ సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ కొట్టాడు. ఇక భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
ఓవర్ నైట్ స్కోరు 311/6తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు.. స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్‌లు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ 112 పరుగులు జోడించారు. దీంతో ఆ జట్టు స్కోరు 400 మార్కును దాటింది. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్.. టెస్టుల్లో 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గబ్బాతో సెంచరీ చేసి.. సుదీర్ఘ విరామం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన స్మిత్.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు వెన్నుముకలా నిలిచాడు.
కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (63 బంతుల్లో 49 రన్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్ ఔట్ అయ్యాక.. మిచెల్ స్టార్క్ (15), నాథన్ లైయాన్ (13), రాణించారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ (140) తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. లైయాన్ ఔట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 122 ఓవర్లు బ్యాటింగ్ చేసి.. 474 పరుగులు స్కోరు చేసింది.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి సత్తాచాటాడు. అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు, ఆకాశ్ దీప్ 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్‌కు ఓ వికెట్ దక్కింది. ఇక ఈ ఇన్నింగ్స్‌లో మహమ్మద్ సిరాజ్ నిరాశపరిచాడు. 23 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ పేసర్.. 122 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మరి భారత బ్యాటర్లు ఏం చేస్తారో..!