బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా తో జరుగుతోన్న చివరి టెస్ట్‌లో టీమిండియా 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. అంతకు ముందు టాస్ గెలిచిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్లు ఆసిస్ పేసర్ల ధాటికి వరుసగా పెవీలియన్‌కు క్యూ కట్టారు. కీపర్ రిషభ్ పంత్ (40), రవీంద్ర జడేజా (26), శుభ్‌మన్ (20), బుమ్రా (22) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్ చేశారు. వీరు కాకుండా మిగతా ఏ బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును టచ్ చేయలేకపోయారు. కేఎల్ రాహుల్ నాలుగు పరుగులు, ప్రముఖ్ కృష్ణ మూడు పరుగులు, మహ్మద్ సిరాజ్ మూడు పరుగులు చేశారు. నితీష్ రెడ్డి ఖాతా తెరవలేకపోయారు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ రెండు వికెట్లు తీయగా, నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు.