షుగర్... ఈ పేరు వింటేనే ప్రస్తుతం అందరూ తెగ భయపడుతున్నారు. జీవనశైలి మార్పుల వల్ల వచ్చే డయాబెటీస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవైపు వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు ఆహారంలో చక్కెరను వీలైనంత పరిమితం చేసుకుంటున్నారు. కానీ ఈ క్రమంలో చాలా మంది తెలియక చేస్తున్న తప్పుల వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండే బదులు పెరుగుతున్నాయి. ఫలితంగా చక్కెర నియంత్రణ ఉద్దేశం నెరవేరట్లేదు. మనం సాధారణంగా చేస్తున్న తప్పులు ఏమిటో తెలుసుకొని వాటిని నివారిస్తే... తీపి తినాలన్న కోరికను లేదా తృప్తిని త్యాగం చేయాల్సిన అవసరం లేకుండానే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.చక్కెర బదులు కృత్రిమ స్వీటెనర్ల వాడకం మంచి ప్రత్యామ్నాయం లాగానే కనిపిస్తుంది. కానీ దాని పర్యవసానాలు మాత్రం ప్రతికూల ఫలితాలు కలిగించే అవకాశం ఉంది. కృత్రిమ స్వీటెనర్లు మనలో తీపి పదార్థాలు తినాలన్న కోరికను విపరీతంగా పెంచుతాయి. అలాగే చక్కెరపై శరీర సహజ స్పందనకు అవాంతరాలు కలిగిస్తాయి. అందువల్ల సహజమైన తీపిని అందించే తాజా పండ్లను తినడంపై దృష్టి పెట్టండి. పండ్లు తియ్యదనంతోపాటు శరీరానికి అవసరమైన పీచు పదార్థాలను, పోషకాలను అందిస్తాయి.చాలా రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఫ్రక్టోస్, మాల్టోస్ లేదా కేన్ సిరప్ లాంటి వేర్వేరు పేర్లతో చక్కెర దాగి ఉంటుంది. గ్రనోలా బార్స్ లేదా యోగర్ట్ లాంటి చాలా ఆరోగ్యకరమైనవిగా చెప్పబడే ఉత్పత్తుల్లో కృత్రిమంగా కలిపిన చక్కెర ఉంటుంది. అలాంటి ఆహార పదార్థాలు తింటే ఇక షుగర్ నియంత్రణ సాధ్యం కాదు. అందుకే ఆహార ఉత్పత్తులపై ఉండే పోషక విలువల లేబుల్స్ లో ఏం ఉందో జాగ్రత్తగా పరిశీలించాలి. వీలైనంత తక్కువగా లేదా చక్కెరలు కలపని ఆహార ఉత్పత్తులనే ఎంపిక చేసుకోవాలి.రోజువారీ ఆహారంలో తీసుకునే చక్కెరను తినడం ఒక్కసారిగా మానొద్దు. అలా చేస్తే తలనొప్పి, చికాకు వంటివి కలుగుతాయి. అలాగే మరింతగా ఆహారం తినాలన్న కోరిక పుడుతుంది. అందుకే శరీరం, రుచి గ్రంథులు అలవాటు పడేలా దశలవారీగా చక్కెర తినడాన్ని తగ్గించుకోండి. టీ లేదా కాఫీలో చక్కెర వాడకాన్ని తగ్గించుకోవడంతో మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. చక్కెరతో కూడిన స్నాక్స్ బదులు ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోండి.చక్కెర నియంత్రణ కోసం కొందరు ఓపూట భోజనం మానేస్తుంటారు. కానీ ఈ చర్య విపరీతమైన ఆకలికి దారితీస్తుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికను మరింత పెంచుతుంది. సమతుల, అధిక ప్రొటీన్లతో కూడిన ఆహారమే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అలాగే మరింతగా తినాలన్న కోరికను తగ్గిస్తుంది. అందుకే అధిక పోషకాలతో కూడిన భోజనం తినడంపై దృష్టిపెట్టండి.బాగా ఆకలేస్తోందని చాలా మంది చిరుతిండ్లు తింటుంటారు. దీనివల్ల చక్కెర నియంత్రణ సాధ్యంకాదు. అందుకే చిరుతిండ్లకు స్వస్తి పలకండి. ఒకవేళ తినాలనుకుంటే ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోండి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే గింజలు, చీజ్ స్టిక్స్ లేదా కూరగాయల ముక్కలు తినండి. వాటిని తినడం వల్ల మరింత తినాలన్న ఆకలి వేయదు. తద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది.