అరటి పండును చాలా మంది ఇష్టంగా, ఎక్కువగా తింటారు. అరటి పండు రుచి కమ్మగా ఉంటుంది. దీంతో... చిన్నా, పెద్దా తేడా లేకుండా అరటి పండును తింటారు. అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. అయితే, అరటి పండు మాత్రమే కాదు అరటి పువ్వు కూడా ఆరోగ్య నిధి అని మీకు తెలుసా? అరటి పువ్వులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషక మూలకాలు పుష్కలంగా ఉంటాయి. అరటి పువ్వులతో చేసే వంటకాలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి శరీరాన్ని లోపల నుంచి రక్షిస్తాయి. దక్షిణ భారతదేశంలో అరటి పువ్వుతో రకరకాల కూరలు చేస్తారు. అవి రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది. అరటి పువ్వుతో చేసే వంటకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అరటి పువ్వు కూర
అరటి పువ్వు కూర ఒక రుచికరమైన, పోషకమైన వంటకం. ఈ వంటకం చేయడానికి, అరటి పువ్వును మొదట బాగా కడగండి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత కాస్త నూనె వేసి తరిగిన ఉల్లి, టమాట ముక్కల్ని వేసి వేయించండి. ఆ తర్వాత అల్లం- వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. కాస్త వేగిన తర్వాత అరటి పువ్వు ముక్కల్ని జోడించండి. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలాను యాడ్ చేయండి. కాసేపు ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు పోయండి. తర్వాత మూత పెట్టండి. కాసేపు కూరను అలాగే ఉడకనివ్వండి. ఇంకేముంది రుచికరమైన అరటి పువ్వు కూర రెడీ. దీన్ని వేడి అన్నం లేదా చపాతీతో పాటు తీసుకోవచ్చు.
అరటి పువ్వు పకోడిలు
కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో అరటి పువ్వు పకోడిలు ఫేమస్ ఇవెనింగ్ స్నాక్. ఈ పకోడిలను తయారు చేయడం కోసం ముందు అరటి పువ్వుల్ని సన్నగా తరగండి. ఆ తర్వాత శనగపండిలో పసుపు, కారం, గరం మసాలా, కొంచెం నీళ్లు వేసి బాగా కలండి. ఆ తర్వాత ఈ పిండి మిశ్రమంలో సన్నగా తరిగిన అరటి పువ్వుల్ని జోడించండి. ఆ తర్వాత వేడి నూనెలో చిన్న చిన్న పకోడిలా వేసుకోండి. బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఈ పకోడిలు క్రంచీ, టేస్టీగా ఉంటాయి.
అరటి పువ్వు కిచిడీ
అరటి పువ్వుతో కిచిడీ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక తేలికపాటి, పోషకమైన వంటకం. దీన్ని చేసుకోవడానికి ముందుగా బియ్యం, పప్పును ముందుగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత తరిగిన అరటి పువ్వులు, పసుపు, జీలకర్ర, ఇంగువ, ఇతర మసాలా దినుసులు కలిపి వండాలి. ఈ కిచిడీ రుచికరంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
బనానా ఫ్లవర్ కోఫ్తాస్
అరటి పువ్వు కోఫ్తాలు ఒక ప్రత్యేకమైన, రుచికరమైన వంటకం. ఈ కోఫ్తాలను తయారు చేసేందుకు ముందుగా అరటి పువ్వును ఉడకబెట్టి, మసాలా దినుసులతో కలిపి చిన్న చిన్న కోఫ్తాలుగా తయారు చేస్తారు. ఈ కోఫ్తాలను టమోటా, ఉల్లిపాయ గ్రేవీలో వండుతారు. ఈ కోఫ్తా కూర అన్నం లేదా రోటీతో చాలా రుచిగా ఉంటుంది.
అరటి పువ్వులతో చేసిన వడ
దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో అరటి పువ్వులతో వడలు చేసుకుంటారు. ఈ వడల్ని తయారు చేయడానికి అరటి పువ్వులు, శనగ పప్పు, మసాలా దినుసులు కలిపి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ పిండితో చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో వేయించుకోవాలి. ఈ వడల్ని సాంబార్ లేదా చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.
అరటి పువ్వు చట్నీ
అరటి పువ్వుతో చేసే చట్నీ స్పైసీగా, భలే రుచిగా ఉంటుంది. దీన్ని చింతపండు, కొబ్బరి, మసాలాలతో కలిపి అరటి పువ్వులను రుబ్బి చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ సౌత్ ఇండియన్ డిషెస్‌కి చాలా బాగుంటుంది. మీరు దీన్ని అన్నం, ఇడ్లీ లేదా దోసలతో తింటే భలే రుచిగా ఉంటుంది.