మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లలోనూ చాలా వరకు పండ్లు అందుబాటులో ఉంటాయి. కానీ అలాంటి పండ్లను మనం సరిగ్గా తినడం లేదు. వాటిల్లో జామ పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇవి మనకు ఏ సీజన్‌లో అయినా సరే లభిస్తాయి. అయితే కొందరు జామ పండ్లను ఇష్టంగానే తింటుంటారు. కానీ వీటిని అధిక శాతం మంది అంతగా పట్టించుకోరు. వాస్తవానికి జామ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. జామ పండ్లను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే రోజుకు కనీసం ఒక్క జామ పండును అయినా తింటే ఎన్నో లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జామ పండ్లను రోజూ తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. మనం తినే ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. జామ పండ్లలో ఫైంర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. విరేచనాల నుంచి ఉపశమనం అందిస్తుంది. విరేచనాలు అవుతున్న వారు జామ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. ఇక అధిక బరువును తగ్గించడంలోనూ జామ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. జామ పండ్లలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.