పాకిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మొదట టి-20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా 2 – 0 తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్ లో మాత్రం పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. సౌత్ ఆఫ్రికా గడ్డపై 3-0 తో వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా విజయ దుందుభి మోగించింది. సెంచూరియస్ లో జరిగిన తొలి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఇక శుక్రవారం ప్రారంభమైన రెండవ టెస్ట్ ని పాకిస్తాన్ ఘోర పరాజయంతో ముగించింది. సోమవారం రోజు ముగిసిన ఈ రెండవ టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ని సౌత్ ఆఫ్రికా 2-0 తో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్ లో టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
సౌత్ ఆఫ్రికా ఓపెనర్ రియాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీ (259) పరుగులతో విరుచుకుపడ్డాడు. ఇక కెప్టెన్ తెంబా బవుమా (106) శతకంతో రాణించాడు. అలాగే వికెట్ కీపర్ వెరెయెన్నే 100, మార్కో జాన్సన్ 62, కేశవ్ మహారాజ్ 40 పరుగులు చేశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా ఏకంగా 615 పరుగుల స్కోర్ చేసింది. ఈ క్రమంలో తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ కేవలం 194 పరుగులకే కుప్ప కూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 478 పరుగులు చేసింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 7.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. తొలి టెస్ట్ లో విజయం సాధించడంతోనే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ ని దక్కించుకుంది సౌత్ ఆఫ్రికా. ఈ క్రమంలో సౌత్ఆఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా సరికొత్త రికార్డుని సాధించాడు. తొలి తొమ్మిది టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగవ కెప్టెన్ గా బవుమా నిలిచాడు.