పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచులు దుబాయి వేదికగా జరగనున్నాయి. అయితే ఈ టోర్నీ కోసం అన్ని జట్లూ.. జనవరి 12 లోపు జట్లను ప్రకటించాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 13 వరకు ఆయా జట్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా భారత జట్టు ఎంపికపై దృష్టి సారించింది.
టెస్టు ఫార్మాట్‌తో పోలిస్తే వన్డే ఫార్మాట్ భిన్నం. టెస్టు జట్టులోనూ చాలా మంది ప్లేయర్లు.. వన్డే జట్టులో ఉండరు. ఇక ఈ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టునే.. ఈ సిరీస్‌కు కూడా కొనసాగించే అవకాశం ఉంది. దీంతో జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సిరీస్ కోసం బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న పలువురు ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులోకి రానున్నారు.
పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టులు హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్‌లు జట్టులోకి రానున్నారు. కొన్ని నెలలుగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడు దేశవాళీ ట్రోఫీలో సత్తాచాటుతున్నాడు. ఇక ఈ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరగనుంది. దీంతో అక్కడి స్పిన్ పిచ్‌లకు అనుగుణంగా.. జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. స్పిన్నర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిలో పోటీలో ఉన్నారు.
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు జట్టులో చోటు ఖాయం. అయితే మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధిస్తాడా లేడా అన్నది తేలాల్సి ఉంది. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఉంటాడు. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా నితీశ్ రెడ్డి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్‌ల ఎంపికపై ఆసక్తినెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
9వ ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా జరిగే మ్యాచ్‌తో తెరలేవనుంది. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. ఫైనల్‌తో కలిపి 15 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. లేకపోతే లాహోర్‌లోనే ఫైనల్ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. అందులో గ్రూప్-ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లాండ్‌లు ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్..
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్
ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో మ్యాచ్
మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్