ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దృష్ట్యా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దూరంగా ఉన్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోందట. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నాటికి అతడికి తగిన విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు అతడిని దూరంగా ఉంచాలని నిర్ణయించింది! ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది.
కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3తో కోల్పోయింది. అయినా ఈ సిరీస్‌లో బుమ్రా.. అద్భుత ప్రదర్శన చేశాడు. ఏకంగా 32 వికెట్లు తీసి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో బుమ్రా 150కి పైగా ఓవర్లు బౌలింగ్ వేశాడు. ఈ నేపథ్యంలో పనిభారం ఎక్కువ కావడంతోనే బుమ్రాకు వెన్నునొప్పికి గురయ్యాడని తెలుస్తోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని ఫ్రెష్‌గా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మెరుగైన ప్రదర్శన చేయాలంటే.. బుమ్రా ఉండటం కీలకం. అయితే బుమ్రా గాయం తీవ్రత తెలియాల్సి ఉంటుంది. తీవ్రత తక్కువగా ఉంటే అతడు కోలుకునేందుకు 2, 3 వారాలు పడుతుంది. అదే తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం.. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం. ఈ నేపథ్యంలో బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోకూడదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కాగా ఇంగ్లాండ్ జట్టు టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 22న తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే జట్టును కూడా ప్రకటించింది. భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది.
భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్..
తొలి టీ20: జనవరి 22 (కోల్‌కతా)
రెండో టీ20: జనవరి 25 (చెన్నై)
మూడో టీ20: జనవరి 28 (రాజ్‌కోట్)
నాలుగో టీ20: జనవరి 31 (పుణె)
ఐదో టీ20: ఫిబ్రవరి 02 (ముంబై)
భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్..
తొలి వన్డే: ఫిబ్రవరి 06 (నాగ్‌పూర్)
రెండో వన్డే: ఫిబ్రవరి 09 (కటక్)
మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్)