కొత్త కారు కొనాలి అనుకునేవారికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కొత్త సమస్యలు తీసుకువచ్చేలా ఉంది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఓ కొత్త ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు సిద్ధం అయ్యాయి. ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనను అమల్లోకి తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తాజాగా ప్రకటించడం గమనార్హం.
రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టేందుకు ఈ కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు మహారాష్ట్ర సర్కార్ తెలిపింది. నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో నివసించే వారు.. తమ కార్లకు పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే ఎక్కడపడితే అక్కడే నిలుపుతున్నారని మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు. ఈ కారణంగానే ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రం అవుతోందని చెప్పారు. ట్రాఫిక్ కారణంగా జనం రోడ్లపైనే గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా అంబులెన్స్, అగ్నిమాపక వంటి ఎమర్జెన్సీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. వాహనాల రద్దీని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇక నుంచి కార్లు కొనుగోలు చేసేవాళ్లు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశారు. ఈ నిబంధనను త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదని పేర్కొన్న మంత్రి ప్రతాప్ సర్నాయక్.. అయితే దానికి అనుగుణంగా తగిన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు అవసరమని తెలిపారు.
ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు.. ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, బస్సులు సహా ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా అదనంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు. ఈ కొత్త నిబంధనను త్వరలోనే అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేతో చర్చిస్తున్నామని వివరించారు.