డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్ట బోతున్నారు. భారత కాలమానం ప్రకారం జనవరి 20న రాత్రి 10:30 గంటలకు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. అయితే, ట్రంప్‌కు ముందు జేడీ వాన్స్.. ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే, అమెరికాలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ హడావిడి వేళ, బైడెన్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హారిస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు (ఇక్కడ, ఇక్కడ) చేస్తున్నారు. పనిలేకుండా, అమెరికా వీధుల్లో కమలా హారిస్ తిరుగుతున్నట్లుగా అసభ్యకరంగా ఉన్న దృశ్యాలను షేర్ చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన భారత సంతతికి చెందిన కమలా హారిస్‌పై భారత మూలాలున్న కొంత మంది వ్యక్తులు సైతం అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారం, దీని వెనుక నిజానిజాలను తెలుసుకుందాం..
క్లెయిమ్ ఏంటి?
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ కమలా హారిస్ - అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలో, కమలా హారిస్‌ను పోలి ఉన్న ఒక మహిళ అసభ్యకరమైన దుస్తులు ధరించి, రోడ్డుపై నడుస్తూ కనిపిస్తోంది. ఆ మహిళ చేతిలో బీరు బాటిల్ కూడా ఉంది.
ఎక్స్ (ట్విట్టర్)లో Kreately.in అనే హ్యాండిల్ నుంచి ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ‘4 ఏళ్ల చిరాకు నుంచి అమెరికా బయటపడింది’ అని రాశారు. సునంద రాయ్ అనే మరో ఖాతా నుంచి ఇదే వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత కమలా హారిస్’ అనే క్యాప్షన్ ఇచ్చారు.
‘కమలా హారిస్ ఇక రేపట్నుంచి నిరుద్యోగి అవుతారు’ అంటూ End Woke Disney అనే పేరు గల యూజర్.. వ్యంగ్యంగా పోస్టు చేశారు. మరికొంత మంది యూజర్లు కూడా ఇదే వీడియోను షేర్ చేసి, కమలా హారిస్‌పై అనుచిత కామెంట్లు చేశారు.
Gif And Let Die అనే ఖాతా నుంచి ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘మేం ఈ వీధుల్లో ఉన్నాం - కమలా హారిస్’ అని రాశారు. ఈ విజువల్స్, ఫోటోలు అసభ్యకరంగా ఉండటంతో మేం (సజగ్ టీమ్) వాటిని బ్లర్ చేశాం.
ఈ వీడియోను పరిశీలిస్తే..
ఈ వీడియోను గమనిస్తే.. కావాలని సృష్టించినదని అర్థమవుతోంది. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (AI)తో రూపొందించి ఉండవచ్చనే అనుమానంతో.. మేం (సజగ్ బృందం) ఆ దిశగా పరిశీలించాం. వీడియో నుంచి కొన్ని కీఫ్రేమ్‌లను తీసుకొని AI కంటెంట్ డిటెక్టర్ decopy.ai లోకి అప్లోడ్ చేసి పరీక్షించగా.. ఇది నకిలీదని తేలింది. 98.38 శాతం AI ద్వారా రూపొందించబడిందని ఫలితం వచ్చింది. కొంత మంది డొనాల్డ్ ట్రంప్ అభిమానులు.. కమలా హారిస్‌పై ద్వేషంతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
ఇది అసలు వాస్తవం..?
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ.. అమెరికా ఉపాధ్యక్ష పదవిని వీడనున్న కమలా హారిస్‌కి సంబంధించి అసభ్యకరమైన వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను AI ద్వారా సృష్టించారు. వీడియోతో పాటు పోస్టు చేస్తున్న వాదనలన్నీ అవాస్తవం.
మీకు వాస్తవాలు తెలియజెప్పడం మా బాధ్యత
నిజాల కంటే అబద్ధాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఫేక్ న్యూస్, తప్పుదోవ పట్టించే వాట్సాప్ మెసేజ్‌లు, ఫేక్ వైరల్ పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండటం మనందరి బాధ్యత. మీరు కూడా అలాంటి మెసేజ్, పోస్ట్ లేదా మీకు సందేహం ఉన్న ఏదైనా లింక్ మీ వరకు వస్తే, నిజ నిర్ధారణ కోసం దాన్ని మాకు పంపవచ్చు. నకిలీ వార్తలను పరిశీలించే మా టీం పూర్తి నిబద్ధతతో ఎంక్వైయిరీ చేస్తుంది, నిజానిజాలను మీకు తెలియజేస్తుంది.
కింద ఇచ్చిన Google ఫామ్‌ను ఫిల్ చేయడం ద్వారా మీరు ఫేక్ అని భావించే వైరల్ పోస్టులు లేదా వీడియోలను మాకు పంపవచ్చు. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి