టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, తనకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్ధిక సాయంగా అందించనునున్నట్లుగా ప్రకటించారు.ఈ మేరకు పంత్ తన ఎక్స్ వేదికగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. కఠిన సమాయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లుగా పంత్ ఈ వీడియోలో తెలిపాడుక్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని, తన వాణిజ్య సంపాదనలో 10 శాతం రిషబ్ పంత్ ఫౌండేషన్ (RPF) ద్వారా విరాళంగా ఇస్తానని స్పష్టం చేశాడు. ఫౌండేషన్ నడపాలనే ఆలోచన తనకు చాలా కాలంగా ఉందని, రాబోయే రెండు నెలల్లో రిషబ్ పంత్ ఫౌండేషన్ గురించి అన్ని విషయాలను పంచుకుంటానని తెలిపాడు. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలు, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పంత్ చెప్పుకొచ్చాడు.పంత్ నిర్ణయాన్ని అభిమానులు చాలా అభినందిస్తున్నారు. గొప్ప వ్యక్తులు ఎల్లప్పుడూ గొప్పగా ఆలోచిస్తారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్న పంత్ ప్రస్తుతం పది బ్రాండ్లకు అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఐపీఎల్లోనూ ఈసారి టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర (రూ.27కోట్లు) దక్కించుకుని రికార్డు నెలకొల్పాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఆ జట్టుకు పంత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.ఇక ఈ వికెట్ కీపర్-బ్యాటర్ 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కాగా గురువారం (ఫిబ్రవరి 6వ తేదీ) నాగ్పూర్లో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రిషబ్ పంత్ ఆడనున్నాడు.