కంప్యూటర్లు, డివైజ్ లలోని సమాచారాన్ని చైనా టెలికాం సంస్థకు చేరవేస్తోందని ఆరోపణలుడీప్ సీక్ పై ఇప్పటికే నిషేధం విధించిన ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ఏఐ రంగంలో చైనాకు చెందిన చాట్ బాట్ డీప్ సీక్ పెను ప్రకంపనలు పుట్టిస్తోంది. దీని వినియోగంపై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించాయి. తాజాగా దక్షిణకొరియా కూడా దీనిపై నిషేధం విధించింది. దక్షిణకొరియా రక్షణ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు దీనిపై స్పందిస్తూ... డీప్ సీక్ వినియోగంపై పలు దేశాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని... తాము కూడా దాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నామని తెలిపాయి. ఇంటెలిజెన్స్ అధికారులు దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి.చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీతో డీప్ సీక్ కు సంబంధాలు ఉన్నాయని... కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్లకు చెందిన లాగిన్ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు డీప్ సీక్ చేరవేస్తోందని పరిశోధకులు చెపుతున్నారు. కెనడాకు చెందిన ఫీరుట్ సెక్యూరిటీ సంస్థ దీన్ని గుర్తించి అసోసియేట్ ప్రెస్ వార్తా సంస్థతో పంచుకుంది. ఆ తర్వాత డీప్ సీక్ కు సంబంధించిన వివరాలను స్వతంత్ర కంప్యూటర్ నిపుణులు ధ్రువీకరించారు. ఈ ఆరోపణలలో డీప్ సీక్ కానీ, చైనా మొబైల్ సంస్థ కానీ స్పందించలేదు. ఇప్పటికే డీప్ సీక్ ను ఇటలీ, ఆస్ట్రేలియా, తైవాన్ దేశాలు నిషేధం విధించాయి. ప్రభుత్వ కంప్యూటర్లు, డివైజ్ లలో డీప్ సీక్ ను వాడటంపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అయితే, వ్యక్తిగత డివైజులపై మాత్రం నిషేధం విధించలేదు. డీప్ సీక్ వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తైవాన్ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. దేశంలో చాట్ బాట్ ను నిషేధిస్తున్నట్టు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది.