ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైయస్ జగన్ కి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలను వంచిస్తున్న వైనంపై వైయస్ జగన్ గారు వేసిన సూటి ప్రశ్నలకు కూటమి నేతలు బదులివ్వలేక కంగారు పడుతున్నారని అన్నారు. తమ అసమర్థతను దాచుకుంటూ వైయస్ జగన్ గారిపై రాజకీయపరమైన విమర్శలతో చెత్త మాటలు, అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.... వైయస్ జగన్ గారు కూటమి ప్రభుత్వ వైఖరిపై, హామీల అమలు, ప్రజలను మోసం చేస్తున్న వైనంపై ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలపై ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. దానికి బదులుగా వైయస్ జగన్ గారిపై అర్థంలేని విమర్శలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వైయస్ జగన్ గారు ఈ 8 నెలల్లో పలుసార్లు మీడియా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వాటిపై ఒక్కసారి కూడా ఈ కూటమి ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పలేకపోయింది. చంద్రబాబు, లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే జగన్ ప్రశ్నలకు మా సమాధానం ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై అనేక అసత్యాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారు. ప్రజలకు అనేక హామీలను ఇస్తూ తాము అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామంటూ నమ్మించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రతి దానికీ గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే కారణమంటూ విమర్శలతో కాలం గడుపుతోంది. ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే 'బాబు ష్యూరిటీ... భవిష్యత్తుకు గ్యారెంటీ' అని పెద్దపెద్ద మాటలు చెప్పారు. హామీలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడగాలని నారా లోకేష్ చెప్పారు. మరి ఈ ఎనిమిది నెలల్లో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ఎవరి కాలర్ పట్టుకుని ప్రశ్నించాలో ఇదే నారా లోకేష్ ప్రజలకు వివరించాలి. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ పదేపదే చెప్పడం తప్ప చంద్రబాబుకు మరొకటి చేతకాదు. చంద్రబాబులా కాకుండా వైయస్ జగన్ గారు తాను ఇచ్చిన ప్రతి హామీని చేయగలనా? లేదా? అని పరిశీలించిన తరువాతే వాటిని ప్రకటించారు. అలాగే అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తూచా తప్పకుండా అమలు చేశారు అని తెలిపారు.
![]() |
![]() |