‘వన్ ఫ్యామిలీ.. వన్ ఏఐ ప్రొఫెషనల్.. వన్ ఎంటర్ప్రెన్యూర్..’ లక్ష్యంతో రూపొందించుకున్న స్వర్ణాంధ్ర-2047కు కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్ర సచివాలయానికి తొలిసారిగా వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీకి సీఎం చంద్రబాబు శుక్రవారం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సచివాలయంలో బేరీ బృందం ఆయనతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్ర ఆకాంక్షలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంటికొకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్లను తీర్చిదిద్ది 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏటా 15 శాతం వృద్ధిరేటు సాధించే దిశగా బలమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది అనుకూలమైన సమయమని పేర్కొన్నారు. విభజన గాయాలు, గత ఐదేళ్లలో మూలధన వ్యయంపై నిర్లక్ష్యం లాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కి రాష్ట్రం బలపడేందుకు నీతి ఆయోగ్ సహకరించాలని కోరారు. హైదరాబాద్ స్థాయి నగరాన్ని పదేళ్ల క్రితమే వదలుకోవడం, పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడటం, గడిచిన ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన లేకపోవడం ఇబ్బందికరంగా పరిణమించాయని వివరించారు. పాలనాపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అభివృద్ధిలో ముందంజ వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే మూడో అతిపెద్ద సముద్ర తీరం కలిగిన ఏపీలో పోర్టులు, హైవేలతో అతిపెద్ద కనెక్టివిటీ కలిగి ఉందని చెప్పారు.