నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ’ ఉండాలి అని సుద్దులు చెప్పిన వైఎస్ జగన్‌కే విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. సొంత తల్లి, చెల్లి, మేనకోడలు, మేనల్లుడికి వెన్నుపోటు పొడిచారని... నీచుడని మండిపడ్డారు. ఆస్తుల కోసం సొంత తల్లిపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డికి ఇష్టంలేకపోయినా, ఆయనపై ఒత్తిడి తెచ్చి... తనను తిట్టించారన్నారు. ‘‘జగన్ క్యారెక్టర్ ఖాళీ సీసాలాంటిది. ఆయన క్యారెక్టర్ సున్నా’’ అని తేల్చేశారు. శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌కు విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవు. నీతులు చెబుతారు కానీ పాటించరు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని జగన్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ ఆశయాలనే కాలరాశారు’’ అని విమర్శించారు. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించింది అవినాశ్ రెడ్డే అని సీబీఐ చెప్పిన తర్వాత కూడా... ఆయనను తన పక్కన కూర్చోబెట్టుకున్నారని ఆక్రోశించారు.
![]() |
![]() |