మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం ముస్తాబు అవుతోంది. శివరాత్రి రోజున కోటప్పకొండ తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కోటప్పకొండ కింద భాగంలో ఉన్న శివపార్వతుల విగ్రహాలకు రంగులు వేస్తున్నారు. శివరాత్రి రోజున రాష్ట్ర నలుమూలల నుంచి కోటప్పకొండకు చేరుకునే భక్తుల కోసం ఆలయ అధికారులు శనివారం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లో కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.. ప్రసాద వితరణ కేంద్రాల సంఖ్య పెంచడం ద్వారా దర్శన అనంతరం భక్తులు కొండపైనే ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గించడం వలన భక్తుల రద్దీ కొంతమేర అదుపులో ఉంచవచ్చన్నారు. ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు తిరునాళ్ల ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమయ్యే సమాచారం అందించాలని భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. కొండపై మొబైల్ నెట్వర్క్ అందించేందుకు ప్రత్యేకంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు.
![]() |
![]() |