ఇంగ్లండ్ కోచ్‌గా మెక్‌కలమ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ఆ జట్టు బజ్ బాల్‌తో మోత మోగిస్తోంది. ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా ఎక్కడైనా పరుగుల వరద రాబడుతోంది. అయితే అది కేవలం ఓపెనర్లకే పరిమితమవుతోంది. టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్ పరిస్థితి అలానే ఉంది.
భారత్ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ బజ్ బాల్ కేవలం ఓపెనర్లకే పరిమితమయింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే, కటక్‌లో రెండో వన్డేలో కూడా ఓపెనర్లు క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతూ వస్తున్నారు.
తొలి వన్డేలో మొదటి వికెట్‌కు ఫిల్ సాల్ట్-బెన్ డకెట్ 8.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించగా, రెండో వన్డేలో 10.5 ఓవర్లలో 81 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి పది ఓవర్లు పవర్ ప్లే కావడంతో క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలపైనే దృష్టి పెట్టారు. తొలి వన్డేలో ఫిల్ సాల్ట్ ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు, బెన్ డకెట్ 32 పరుగులు చేశారు. రెండో వన్డేలో డకెట్ పది ఫోర్లతో 65, సాల్ట్ 26 పరుగులు నమోదు చేశారు.
టీమిండియా పరిస్థితి మాత్రం ఇందుకు చాలా భిన్నంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడంతో తక్కువ పరుగులకే వికెట్లు చేజార్చుకోవాల్సి పరిస్థితి. మొదటి వన్డేలో 19 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. జైస్వాల్ 15, రోహిత్ 2 పరుగులకే అవుటయ్యారు. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించి మొదటి వన్డేలో జట్టుకి విజయాన్ని అందించారు.
కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇంగ్లండ్ చూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్ ఇరు జట్లకి చాలా కీలకం. పాకిస్తాన్‌లో రాణించాలంటే ఇంగ్లండ్‌కి భారత్‌పై ఈ సిరీస్ చాలా ముఖ్యం.
![]() |
![]() |