గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ సెంచరీతో అన్నింటికీ సమాధానమిచ్చాడు. ఇంగ్లండ్ తో రెండో వన్డేలో రోహిత్ శర్మ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. 76 బంతుల్లో శతకం బాదాడు. రోహిత్ శర్మకు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. ఇటీవల కాలంలో రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఈ స్థాయిలో పరుగులు జాలువారడం అభిమానులను ఎంతో ఆనందానికి గురిచేసింది. పైగా, మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా ఈవెంట్ ఉండడంతో... హిట్ మ్యాన్ సరైన సమయంలో ఫామ్ లోకి వచ్చినట్టు భావించాలి. కెప్టెన్ రాణిస్తేనే జట్టులో గౌరవం ఉంటుందనికపిల్ దేవ్ వంటి లెజెండ్ పరోక్ష వ్యాఖ్యలు చేసిన క్రమంలో... రోహిత్ శర్మ సెంచరీతో భారీ ఊరట పొందాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే... 305 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా దూసుకుపోతోంది. 28 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 82 బంతుల్లో 116 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. హిట్ మ్యాన్ స్కోరులో 12 ఫోర్లు, 7 భారీ సిక్సులు ఉన్నాయి. శుభ్ మాన్ గిల్ 60 పరుగులు చేయగా... గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 5 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. ప్రస్తుతం రోహిత్ శర్మకు తోడుగా శ్రేయాస్ అయ్యర్ (14) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 1, జేమీ ఒవెర్టన్ 1 వికెట్ తీశారు.
![]() |
![]() |