305 పరుగుల టార్గెట్ ను 44.3 ఓవర్లలో ఛేదించిన వైనం రోహిత్ శర్మ సెంచరీ రాణించిన అయ్యర్, అక్షర్ పటేల్ ఇంగ్లండ్ పై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా... తాజాగా వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఇవాళ కటక్ లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై జయభేరి మోగించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. 305 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 44.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 6 వికెట్లకు 308 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీనే హైలైట్. ఇటీవల ఫామ్ లో లేక తీవ్రంగా ఇబ్బందులుపడిన రోహిత్ శర్మ ఎట్టకేలకు విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పాడు. 90 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 12 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 52 బంతుల్లో 60 పరుగులు చేయగా... శ్రేయాస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఒవెర్టన్ 2, గస్ ఆట్కిన్సన్ 1, అదిల్ రషీద్ 1, లియాం లివింగ్ స్టన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. దాంతో, ఈ నెల 12న జరిగే మూడో వన్డే నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.
![]() |
![]() |