ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ అంతరాయానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఒడిశా ప్రభుత్వం.. కారణం ఇదే....

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 11:37 PM

ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌కు 35 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఫ్లడ్ లైట్స్‌ వెలగని కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. సరిగ్గా భారత బ్యాటింగ్ సందర్భంగానే ఈ సమస్య తలెత్తడం క్రికెట్ అభిమానులను చికాకుకు గురి చేసింది. రోహిత్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడుతుండగా మ్యాచ్ ఆడిపోవడం మరింత అసహనానికి గురి చేసింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానం వీడాల్సి రాగా.. మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. ఇక ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ఆదేశించింది. ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. '30 నిమిషాలకు పైగా ఆటకు అంతరాయం కలిగింది. ఆటగాళ్లు, ప్రేక్షకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ వైఫల్యానికి కారణం ఏంటి? బాధ్యులైన వ్యక్తులు, ఏజెన్సీలు ఎవరో చెప్పండి. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో వివరణ ఇవ్వండి'అని ఆ నోటీసులో పేర్కొంది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.


జనరేటర్‌లో సమస్యతో రావడంతో ఫ్లడ్‌లైట్ వెలగలేదని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. మరో జనరేటర్‌ను తెచ్చి కనెక్షన్ ఇచ్చే సరికి ఆలస్యమైందని చెప్పారు. ఈ మ్యాచ్‌కు 45 వేల మంది ప్రేక్షకులతో పాటు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే ఫ్లడ్ లైట్స్ ఆగిపోయి మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత కటక్‌లో బారాబతి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగ్గా.. సరైన ఏర్పాట్లు చేయడంలో ఒడిశా క్రికెట్ అసోసియేషన్ విఫలమైంది. తాజా ఘటనతో భవిష్యత్తులో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి బీసీసీఐ మ్యాచ్ కేటాయిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలే మ్యాచ్‌ల కేటాయింపుల విషయంలో దేశంలోని క్రికెట్ అసోసియేషన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com