త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ట్రై సిరీస్ ఆడుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నాడు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో కివీస్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్ లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ లో సరిపడా ఆటగాళ్లు లేకపోవపోడంతో సఫారీ జట్టు ఏకంగా ఫీల్డింగ్ కోచ్ నే బరిలోకి దించింది. ఎక్కువ మంది ప్లేయర్లు సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఉండిపోవడంతో ఈ ట్రై సిరీస్ లో ఆ జట్టుకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ఈ టోర్నీ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కేవలం 12 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక నిన్నటి మ్యాచ్ లో ఈ 12 మందిలో ఇద్దరు ప్లేయర్లు ఎమర్జెన్సీ కారణంగా మైదానం వీడారు. దాంతో ఒక ఫీల్డర్ తక్కువ కావడంతో చేసేదేమీలేక ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా బరిలోకి దిగాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు ఇలాంటి ఘటన కొత్తేమీ కాదు. గత సీజన్ లో అబుదాబి జరిగిన ఓ మ్యాచ్ లో ఆ జట్టు ప్లేయర్లు అస్వస్థతకు గురికావడంతో అప్పటి ఆ టీమ్ బ్యాటింగ్ కోచ్ జేపీ డుమిని సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా బరిలోకి దిగాడు. కాగా, సోమవారం నాటి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ సునాయాసంగా ఛేదించింది. కేన్ విలియమ్సన్ అజేయ శతకం (133)తో రాణించాడు.
![]() |
![]() |